ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ రోహిత్ ను ఊరిస్తున్న రికార్డ్

భారత్,ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుని ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహకంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 03:35 PMLast Updated on: Feb 05, 2025 | 3:35 PM

The Odi Series With England Is A Record For Rohit

భారత్,ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుని ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహకంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. తొలి వన్డేకు నాగ్ పూర్ లో ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ పై భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భారీ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో రికార్డుల్ని నమోదు చేసిన రోహిత్ కొంత గ్యాప్ తర్వాత మరో మైలు రాయిని చేరుకోనున్నాడు.

ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ కేవలం 134 పరుగులు చేస్తే తన ఖాతాలో భారీ రికార్డు నమోదవుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది.దీంతో వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా అవతరిస్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనే రోహిత్ ఈ రికార్డు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తద్వారా మెగాటోర్నీకి ముందు సెంచరీతో ఫామ్ లోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు.

వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 222 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ 276 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పాంటింగ్ 286 మ్యాచ్‌ల్లో 11 వేల రన్స్ సాధించి మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 288 వన్డేల్లో 11 వేల రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు 265 వన్డేల్లో 92.44 స్ట్రైక్ రేట్ మరియు 49.17 సగటుతో 10,886 పరుగులు చేశాడు. దీనిలో 31 సెంచరీలు మరియు 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మన్ గానూ రోహిత్ చరిత్ర సృష్టించాడు.