కింగ్ ను ఊరిస్తున్న రికార్డ్ శతక్కొడితే కొత్త చరిత్రే
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే రికార్డులు సలాం చేయాల్సిందే... ఫార్మాట్ ఏదైనా, అంతర్జాతీయ క్రికెట్ అయినా.. ఐపీఎల్ అయినా పరుగుల వరదే...అందుకే కోహ్లీ ఆడితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణుకే.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే రికార్డులు సలాం చేయాల్సిందే… ఫార్మాట్ ఏదైనా, అంతర్జాతీయ క్రికెట్ అయినా.. ఐపీఎల్ అయినా పరుగుల వరదే…అందుకే కోహ్లీ ఆడితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణుకే…ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీతో విరాట్ తన ఫామ్ ను మళ్ళీ అందుకున్నాడు. ఇప్పుడు మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో సీజన్ ముంగిట అరుదైన రికార్డు కింగ్ ను ఊరిస్తోంది. కోహ్లీ ఐపీఎల్ లో మరో సెంచరీ బాదితే టీ20 క్రికెట్ లో భారత్ తరఫున 10 సెంచరీలు బాదిన తొలి ప్లేయర్ గానూ నిలుస్తాడు. అలాగే బాబర్ అజామ్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేస్తాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక సెంచరీల నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అందులో 8 ఐపీఎల్ లో బాదగా.. ఒకటి అంతర్జాతీయ క్రికెట్ లో కొట్టాడు. 2022లో టీ20 ఆసియా కప్ లో అప్ఘానిస్థాన్ పై బాదాడు. ఓవరాల్ గా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 11 శతకాలతో ఉండగా, విరాట్ 9 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ గత 17 ఏళ్లగా ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటికే రన్ మెషీన్ ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ లో చాలా రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 252 మ్యాచ్‌లలో 8శతకాలు, 55 అర్ధ సెంచరీలతో 8004 పరుగులు చేశాడు. 222 మ్యాచుల్లో 6769 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 2 వ స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ 257 మ్యాచుల్లో 6628 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ విరాట్ దుమ్మురేపాడు. 2023 సీజన్ లో 639 పరుగులు, 2024 సీజన్ లో 741 పరుగులు చేశాడు. కోహ్లీ ఐపీఎల్ కెరీర్ లో అత్యుత్తమం గా నిలిచింది 2016 సీజనే… ఈ సీజన్ లో ఏకంగా 973 రన్స్ తో పరుగుల వరద పారించాడు. ఈ సీజన్ లో ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. అలాగే కోహ్లీ సెంచరీలు సాధించిన సీజన్లను వరుసగా చూస్తే 2019లో 1, 2023 లో 2 , 2024లో 1 శతకాలు సాధించాడు.
2008 ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై RCB తరపున కోహ్లి IPL అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో అతను ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కానీ ఇప్పుడు 86 ఇన్నింగ్స్‌లలో, RCB మాజీ కెప్టెన్ స్టేడియంలో 22 అర్ధ సెంచరీలు మరియు నాలుగు సెంచరీలు కొట్టాడు, అత్యధికంగా 113 పరుగులు చేశాడు. అంతే కాదు కోహ్లి ఒక్క చిన్నస్వామి స్టేడియంలో 3400 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 700 పరుగుల మార్కును అధిగమించి క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. RCB కోసం గేల్ 2012 మరియు 2013లో రెండుసార్లు 700కి పైగా పరుగులు సాధించాడు, అయితే కోహ్లీ మొదటిసారిగా 2016లో మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ బ్యాటర్ గా పేరున్న కోహ్లీ ఈ సీజన్ లోనూ అదరగొడతాడని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.