చెపాక్ లోనే తిప్పేస్తారా ? రెండో టీ20లోనూ స్పిన్నర్లే కీలకం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.తొలి మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 05:10 PMLast Updated on: Jan 25, 2025 | 5:10 PM

The Second T20i Will Be Held At Chepak Stadium In Chennai On Saturday

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.తొలి మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఇరు జట్లు రెండో మ్యాచ్ కు రెడీ అవుతున్నాయి. శనివారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రెండో టీ ట్వంటీ జరగనుంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. తమ దూకుడు కొనసాగిస్తూ సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా… సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. తొలి టీ ట్వంటీలో టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత స్పిన్నర్లు అదరగొట్టేశారు. ఆ మ్యాచ్ లో జోస్ బట్లర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ తీవ్రమైన ఒత్తిడిలో కనిపిస్తోంది. చెన్నై పిచ్ కూడా ఇంగ్లాండ్ కు సవాల్ గానే చెప్పాలి. ఎందుకంటే చెపాక్ పిచ్ లోనూ స్పిన్నర్లదే ఆధిపత్యంగా ఉంటుంది.

చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత ఈజీ కాదు. తొలి మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపింది. రవి బిష్ణోయ్ తో పాటు వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారు. ఈ కారణంగానే షమీకి తుది జట్టులో టోటు దక్కలేదు. ఇప్పుడు చెపాక్ పిచ్ పైనా ముగ్గురు స్పిన్నర్లు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు చేయడం సవాల్ గానే ఉండబోతోంది. అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు.

లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్. ఇప్పుడు అతన్ని బట్లర్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. చెన్నై పిచ్‌ను పరిశీలిస్తే బట్లర్ ఒక మార్పు చేసి లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరో ఆటగాడు జాకబ్ బెథెల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కాగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ స్పిన్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఇది వారికి ఇబ్బందికరంగా మారొచ్చు. నిజానికి ఇంగ్లీష్ బ్యాటర్లు స్పిన్ ఆడడంలో ఎప్పుడూ ఫెయిలవుతుంటారు. దీంతో మరోసారి భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కాగా చెపాక్ స్టేడియంలో ఓవరాల్ గా 9 టీ ట్వంటీలు జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఆరుసార్లు విజయం సాధించింది. దీంతో మరోసారి టాస్ కీలకం కాబోతోంది. పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ కే మొగ్గుచూపొచ్చు.