Mumbai Indians: ముంబై వద్దనుకుంటున్న ముగ్గురు స్టార్స్?
ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ గెలవలేకపోయిన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. అప్‌కమింగ్ సీజన్‌పై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ మినీ వేలం కోసం వ్యూహ రచన చేస్తోంది. అవసరమైన ఆటగాళ్లతో పాటు పనికిరాని ఆటగాళ్ల జాబితాలను సిద్దం చేస్తోంది. ఇక వరుస ఓటములతో ఐపీఎల్ 2023 సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. తర్వాత సంచలన విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరింది. ముఖ్యంగా రెండో దశ టోర్నీలో వరుస విజయాలతో టైటిల్ రేసులోకి దూసుకొచ్చింది. కానీ బలహీనమైన బౌలింగ్ విభాగం ఆ జట్టు కొంపముంచింది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో ఓటమిపాలై ఇంటిదారిపట్టింది.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో పాటు జోఫ్రా ఆర్చర్ పేలవ ప్రదర్శన ఆ జట్టు కొంపముంచింది. ఈ క్రమంలోనే టీమ్‌కు పనికిరాని ఆటగాళ్లను సిద్దం చేసుకుంది. ఈ జాబితాలోని ఓ ముగ్గురు భారత ఆటగాళ్లకు ముంబై ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో పియూష్ చావ్లా అద్భుత ప్రదర్శన కనబర్చినా.. అతని వయసు, ఫిట్‌నెస్ వ్యవహారలపై ముంబై ఇండియన్స్ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. 36 ఏళ్ల పియూష్ చావ్లా వచ్చే ఏడాది వరకు తన ఫిట్‌నెస్ ఏ మేరకు కాపాడుకుంటాడనేదానిపైనే అతను ఆడే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో తప్పా పియూష్ చావ్లాతో ముంబైకి ఎలాంటి సమస్యలు లేవు.
పైగా ఐపీఎల్ 2023 సీజన్‌లో అతనే ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 16 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్ల తీసాడు. ఒకవేళ అతన్ని తొలిగించిన సపోర్టింగ్ స్టాఫ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హృతిక్ షోకీన్ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే తీసాడు. బ్యాటింగ్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులే చేశాడు. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో హృతిక్ షోకీన్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు మాత్రమే తీసాడు.
ఓవర్‌కు 13.41 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. మరోవైపు ఆకాశ్ మధ్వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చడం.. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో అర్షద్ ఖాన్‌ను ముంబై వదులుకోనుంది. అయితే ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు జరిగే దేశవాళీ క్రికెట్‌లో వీరి ప్రదర్శన ఆధారంగా ముంబై ఇండియన్స్ తుది నిర్ణయం తీసుకోనుంది.