ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం భారత తుది జట్టు ఇదే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. టైటిల్ ఫేవరెట్ జాబితాలో ముందున్న టీమిండియా ఈ మెగాటోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన రోహిత్ సేన ఇప్పుడు మరో ఐసీసీ టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 12:15 PMLast Updated on: Feb 20, 2025 | 12:15 PM

The Three Spinner Strategy Is The Indian Final Team

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. టైటిల్ ఫేవరెట్ జాబితాలో ముందున్న టీమిండియా ఈ మెగాటోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన రోహిత్ సేన ఇప్పుడు మరో ఐసీసీ టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ టోర్నీని ఘనంగా ఆరంభించాలనుకుంటున్న భారత్ తొలి మ్యాచ్ లో గురువారం బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. భారత్ పాక్ వెళ్ళి ఆడేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీంతో మన మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమిస్తోంది. బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ కోసం భారత తుది జట్టుపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల వ్యూహంతోనే బరిలోకి దిగుతోంది. ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లతో పాటు ఒక ప్రధాన స్పిన్నర్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా… స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వస్తాడు. ఈ ముగ్గురూ ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఫామ్ లోకి వచ్చారు. కోహ్లీ పూర్తిస్థాయి బ్యాటింగ్ తో అదరగొట్టకపోయినా టచ్ లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ , కోహ్లీ ఇద్దరికీ మంచి రికార్డే ఉండడంతో వీరిపై అంచనాలున్నాయి.నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడనుండగా… కెెఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. రిషబ్ పంత్ కంటే రాహుల్ వైపే మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతుండడంతో అతనికే కీపింగ్ బాధ్యతలు ఖాయం. ఆరో స్థానంలో హార్థిక్ పాండ్యా, ఏడో స్థానంలో అక్షర్ పటేల్…ఆ తర్వాత రవీంద్ర జడేజా వస్తారని తెలుస్తోంది. బ్యాటింగ్ పరంగా ఈ ఆర్డర్ లో మార్పులు ఉండకపోవచ్చు. ఇంగ్లాండ్ తో సిరీస్ సందర్భంగా రాహుల్ ను ఆరోస్థానంలో పంపించడం వర్కౌట్ కాలేదు. పైగా ఈ ప్రయోగం అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపించింది. దీంతో ఇలాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు.

బౌలింగ్ విభాగంలో ప్రధాన స్పిన్నర్ గా ఎవరిని ఆడించాలనే దానిపై కోచ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. గంభీర్ వరుణ్ చక్రవర్తిని ఆడించాలనుకుంటే… రోహిత్ మాత్రం గత రికార్డుల ప్రకారం కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడు. దాదాపు కుల్దీప్ పేరే ఖారరైనట్టు సమాచారం. ఇక పేస్ విభాగంలో బుమ్రా లేకపోవడం టీమిండియాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. దీంతో పేస్ భారమంతా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపైనే పడనుంది. వన్డే ప్రపంచకప్ లో అదరగొట్టిన షమీ ఆ తర్వాత గాయం కారణంగా 15 నెలలు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన షమీ బుమ్రా లోటును ఎంతవరకూ భర్తీ చేస్తాడనేది చూడాలి. అలాగే మరో పేసర్ గా అర్షదీప్ సింగ్ కే చోటు దక్కనుంది. హర్షిత్ రాణా ఇంగ్లాండ్ పై రాణించినప్పటకీ పరుగులు ఇచ్చేశాడు. దీంతో పవర్ ప్లేలోనూ, డెత్ ఓవర్స్ లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసే అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఆడనున్నాడు. గత రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్ పై భారత్ దే పైచేయిగా ఉన్నప్పటకీ ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.