రాసిపెట్టుకోండి.. టైటిల్ భారత్ దే ఆసీస్ మాజీ కెప్టెన్ జోస్యం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ స్టేజ్ కు చేరింది. చాలా మంది అంచనా వేసినట్టుగానే టైటిల్ ఫేవరెట్స్ టీమిండయాతో పాటు ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ స్టేజ్ కు చేరింది. చాలా మంది అంచనా వేసినట్టుగానే టైటిల్ ఫేవరెట్స్ టీమిండయాతో పాటు ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌తో లీగ్ దశకు తెరపడనుంది.ప్రస్తుతం టైటిల్ ఎవరు గెలుస్తారన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అంచనా వేసాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో టీమిండియా విజయం సాధిస్తుందన్నాడు.
తాను ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పిన క్లార్క్ అంచనా ప్రకారం భారత్ కే టైటిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్ టీమ్ గా ఉందని, ఫైనల్లో ఈ సారి తమ జట్టుపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని క్లార్క్ అంచనా వేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఆసీస్ చేతిలో పరాజయం పాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. దీంతో ఆ ఓటమికి ఇప్పుడు రోహిత్ దెబ్బకొట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా ఎవరు నిలుస్తారనే దానిపైనా క్లార్క్ మాట్లాలాడు. తన అంచనా ప్రకారం ఈ టోర్నీలో రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉందన్నాడు. అతను ఫామ్‌లోకి వచ్చాడనీ, దుబాయ్ కండిషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తాడనీ చెప్పుకొచ్చాడు. దూకుడైన ఆటతో పవర్ ప్లేను ఉపయోగించుకుంటాడని అంచనా వేశాడు. రోహిత్ రిస్కీ షాట్స్ ఆడే అవకాశం ఉందన్న క్లార్క్ ఒకవేళ భారత్ టైటిల్ గెలిస్తే.. రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరినప్పటికి వాటి స్థానాలు ఇంకా ఖరారు కాలేదు.
ఆదివారం న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ తర్వాతే సెమీస్‌లో ఎవరి ప్రత్యర్ధి ఎవరన్నది తేలనుంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైంది. కానీ ప్రత్యర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్నది ఇవాళ తెలుస్తుంది.గ్రూప్ బి నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది.