Cricketers – Wrestlers: రెజ్లర్ల పోరాటంపై క్రికెటర్లు మాట్లాడరేం..? ఈ గాడ్‌లు, గోట్‌లు, కింగ్‌ హోదాలు మడిచి పెట్టుకోండి..

దేశంలో ఇంతటి హోద అనుభవిస్తున్న క్రికెటర్లకు సాటి క్రీడాకారుల బాధల పట్ల కానీ.. సమస్యల పట్ల కానీ కనీసం బాధ్యత లేదా? స్టార్ రెజ్లల్ వినేశ్‌ పోగట్‌ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2023 | 10:55 AMLast Updated on: May 01, 2023 | 10:56 AM

Their Choice To Not Speak Up For Fellow Athletes And Their Struggle Vinesh Phogat Questions Cricketers Silence Over Wrestlers Protest

పేరుకే దేవుళ్లు, కింగ్‌లు..! ఆటలో తోపులే కావచ్చు, ప్రపంచాన్ని ఏలిన వారే కావచ్చు… కానీ వ్యక్తిగతంగా మాత్రం అత్యంత స్వార్థపరులు..! తమ సంపాదన, పేరు, ప్రతిష్టలు తప్ప మరొక యావ లేని బావిలో కప్పలు..! దేశంలో క్రికెట్‌కున్న క్రేజ్‌ మరే క్రీడకూ లేదు.. క్రికెటర్లకున్న ఫాలోయింగ్ దేశాన్నీ, రాష్ట్రాలను శాసిస్తున్న మంత్రులు, అధికారులకు కూడా ఉండదు..అందుకే వాళ్ల క్రేజ్‌ను రాజకీయ పార్టీలు క్యాంపెయినింగ్‌కు వాడుకుంటాయి.. అందుకే వాళ్లు ఏ బ్రాండ్‌ యాడ్‌లో కనిపిస్తే అవి కొనేసుకుంటాం.. అందులో మద్యం, బెట్టింగ్‌,పేకాట లాంటి దరిద్రాలున్నా కూడా ఆలోచించం.. ప్రజలకున్న పిచ్చి అలాంటిది.. అది వేరే విషయం.. అయితే దేశంలో ఇంతటి హోద అనుభవిస్తున్న క్రికెటర్లకు సాటి క్రీడాకారుల బాధల పట్ల కానీ.. సమస్యల పట్ల కానీ కనీసం బాధ్యత లేదా? స్టార్ రెజ్లల్ వినేశ్‌ పోగట్‌ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా..? క్రికెటర్లకు బ్రాండ్‌, డబ్బులే ముఖ్యమా..? క్రికెటర్లకు ఎందుకంత భయం..?

కెరీర్‌ను పణంగా పెట్టి మరీ పోరాటం:
తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (WFI) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‭పై రెజర్ల పోరాటం అంతకంతకూ పెరుగుతోంది. బ్రిజ్ భూషణ్ ఎంతో పలుకుబడి ఉన్న నాయకుడు.. అధికార పార్టీ ఎంపీ.. పవర్‌లో ఉన్నాడు.. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అండదండలున్నాయి.. అయితేనేం.. మహిళా రెజ్లర్లు ఉక్కు పట్టు పట్టారు.. న్యాయం కోసం రోడెక్కారు..నెలలు గడుస్తున్నా పట్టిన పట్టు మాత్రం వదల్లేదు. ఓవైపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికే మీనమేషాలు లెక్కిస్తోన్న పోలీసులు.. మరోవైపు రెజ్లర్లు తప్ప మరే ఇతర క్రీడాకారులు తమకోసం ముందుకు రాని దుస్థితి..సుప్రీంకోర్టు తలుపు తడితే కానీ కేసు ముందుకు కదల్లేదు. ఎప్పుడో జనవరిలో మొదలు పెట్టిన నిరసన.. మధ్యలో న్యాయం జరుగుతుందనే ఆశతో ఆగింది. విచారణకు కంటితుడుపు కమిటీ వేసిన క్రీడాశాఖ.. ఆందోళన చేస్తున్న రెజర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రెజ్లర్లు మరోసారి వీధికెక్కారు.. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత బ్రిజ్ భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసినా వెనక్కి తగ్గబొమని.. న్యాయం జరిగేదే లేదని స్పష్టం చేస్తున్నారు.. అదే సమయంలో రెజ్లర్ల పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వినేశ్‌ పోగట్‌ క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు తూటాల్లా పేలుతున్నాయి…

బ్లాక్ లైవ్స్ మేటర్ సంగతి సరే.. మా గురించి పట్టదా?
అమెరికాలో నల్లజాతీయులపై తెల్లజాతీయుల దాడులకి, వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో ఊపందుకున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి మాన క్రికటర్లు బహిరంగంగానే మద్దతు పలికారు.. అది మంచి విషయమే.. అది ఎవరూ కాదనరు.. మరి మన దేశంలో సాటి మహిళా రెజ్లర్లు సమస్యలో ఉంటే మన క్రికెటర్లకు పట్టదేం..? వాళ్లు మాట్లాడరేం..? బయటకు వచ్చి మద్దతు తెలిపే ధైర్యం ఎలాగో లేదు.. కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్టుకు కూడా రెజ్లర్ల పోరాటం నోచుకోదా..? లేకపోతే అలా పోస్టో, ట్వీటో చేయాలన్న డబ్బులు కావాలా ఏమీ..? సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా తన ఆవేదనను బయటపెట్టింది వినేశ్‌ పోగట్.. క్రికెటర్లతో పాటు స్టార్ హోదా అనుభవిస్తున్న ఇతర క్రీడాకారులను కూడా ఆమె కడిగిపడేసింది.తమ పోరాటంపై ఇతర భారత క్రీడాకారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీసింది.స్పాన్సర్‌షిప్‌ల ఒప్పందాలను చూసి భయపడుతున్నారా? లేదా వ్యవస్థను చూసి వణికిపోతున్నారా? అని ప్రశ్నించింది.

ఎందుకంత భయం..? మరెందుకీ బిల్డప్‌లు..?
ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో అథ్లెట్ల విజయాలను ప్రశంసిస్తూ దేశంలోని ప్రముఖ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే ఇంత పెద్ద ఆందోళన కొనసాగుతున్నా ఈ విషయంపై మాత్రం ఒక్కటంటే ఒక్క పోస్టూ పెట్టలేదు మన క్రికెట్ లెజెండ్లు. వాళ్లంతా ఎందుకు మౌనం వహిస్తున్నారో కుండ బద్దలు కొట్టేసినట్లు మాట్లాడేసింది వినేశ్‌ పోగట్. క్రికెటర్లు, ఇతర క్రీడాకారులకు ఉన్న స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలు వారిని మౌనంగా ఉండమని బలవంతం చేస్తున్నాయోమో అంటూ చురకలంటించింది. పతకాలు సాధించినప్పుడు తమకు అభినందనలు చెబుతూ పోస్టులు పెట్టాల్సిన అవసరంలేదని ..రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడమని కూడా చెప్పడం లేదని.. కనీసం న్యాయం జరగాలంటూ ఒక్క పోస్ట్‌ అయినా పెట్టమని అభ్యర్థిస్తున్నామంటూ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులను ఏకీపారేసింది వినేశ్‌. బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్, బాక్సర్ అయినా ముందుకొచ్చి తమకు మద్దతు తెలపండంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే వాళ్ల డబుల్ స్టాండర్డ్‌ మెంటాలిటీని బయటపెట్టింది. అటు వినేశ్‌ మాట్లాడింది అక్షరాల నిజమంటూ ఆమెకు మద్దతిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.. మరి ఇప్పటికైనా మన గాడ్లు, గోట్‌లు, కింగ్‌లు.. ఇతర స్టార్‌ క్రీడాకారులు స్పందిస్తారా..?