అప్పుడు 6 సిక్సర్లు.. ఇప్పుడు సెంచరీ ఎవరీ ప్రియాన్ష్ ఆర్య ?
అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి... క్రికెట్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు ఎప్పుడూ వాల్యూ ఉంటుంది.. ప్రస్తుతం ఈ రెండూ ప్రియాన్ష్ ఆర్యకు సరిగ్గా సూట్ అవుతాయి...

అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి… క్రికెట్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు ఎప్పుడూ వాల్యూ ఉంటుంది.. ప్రస్తుతం ఈ రెండూ ప్రియాన్ష్ ఆర్యకు సరిగ్గా సూట్ అవుతాయి… ఎందుకంటే ఢిల్లీ క్రికెట్ లీగ్ లో ఒకే ఒవర్లో ఆరు సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చిన ప్రియాన్ష్ ఆర్య ఐపీఎల్ వేలంలోనూ భారీ ధరకు అమ్ముడయ్యాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న ఈ యువ క్రికెటర్ ను పంజాబ్ 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రెండు మూడు మ్యాచ్ లలో పెద్దగా సత్తా చూపలేకపోయిన ప్రియాన్స్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రం శతక్కొట్టాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొట్టాడు. స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అలవోకగా బౌండరీలు బాదేశాడు. ప్రియాన్ష్ ఆర్య తొలి బంతినే సిక్సర్‌గా తరలించి తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు. అయితే రెండో బంతికే అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను సెంచరీతో రెచ్చిపోయాడు.
సీఎస్కేపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది తన జట్టు మంచి స్కోరు సాధించేలా చేశాడు. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. ఆత్మవిశ్వాసంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ 24 ఏళ్ళ బ్యాటర్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్ లో సహచరులు విఫలమవుతున్నా ఒక్కడే వారియర్ లా పోరాడాడు. ప్రియాంష్ ఆర్య చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా మతీశ పతిరణ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్టార్ బౌలర్ల బౌలింగ్‌లో సిక్స్‌ల వర్షం కురిపించిన ఈ ప్లేయర్ ఎవరని అంతా సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల ప్లేయర్.. క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు.
న్యూఢిల్లీలోని అశోక్ విహార్‌లో పెరిగిన ప్రియాన్ష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉంది. ప్రియాన్ష్‌కు అతడి తల్లిదండ్రలు ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌తో పాటు అతడు చదువులోనూ రాణించాడు. ఇక 2019లో భారత అండర్-19 జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఆ సమయంలో ప్రస్తుతం భారత సీనియర్ జట్టుకు ఆడుతున్న యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయ్‌లతో కలిసి ఆడాడు. 2021లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2023లో లిస్ట్- ఏ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ద్వారా ప్రియాన్ష్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. దీంతో భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతులకు ఆరు సిక్సర్ల కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. . ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు.
ప్రియాన్ష్ ఆర్య ప్రతిభను గుర్తించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతడిని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.3.8 కోట్లు చెల్లించి పంజాబ్ దక్కించుకుంది. పంజాబ్ నమ్మకాన్ని నిలబెడుతూ సీఎస్కేతో మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ దుమ్మురేపాడు. అతని ఆట తీరు చూస్తుంటే త్వరలో స్టార్ ప్లేయర్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.