సయ్యద్ అబిద్ అలీ ఇక లేరు… దిగ్గజ ఆల్‌రౌండర్ కన్నుమూత…!

భారత్ క్రికెట్ లో విషాదం నెలకొంది.హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలోని ట్రేసీలో తన నివాసంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆటగాడిగా పేరు పొందారు. ఆయన 1971లో ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్ తొలి టెస్ట్ విజయం సాధించిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో విజయ రన్స్ కొట్టిన ఘనత కూడా ఆయనదే.
అబిద్ అలీ తన కెరీర్‌లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు, ఇందులో 47 వికెట్లు తీసుకున్నారు. మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు ధైర్యవంతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. 1967లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో 6/55 ప్రదర్శనతో అరంగేట్రం అద్భుతంగా ఆరంభించారు. హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, స్థానిక క్రికెట్‌లో అనేక విజయాలు సాధించారు. ఆయన స్వగ్రామం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి యువ క్రికెటర్లకు మార్గదర్శనం చేసేవారు.
1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా నిలిచారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించారు.అబిద్ అలీ మరణ వార్త క్రికెట్ ప్రపంచంలో శోకాన్ని నింపింది. ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడినప్పటికీ, హైదరాబాద్‌తో ఆయనకు ఎప్పుడూ లోతైన అనుబంధం ఉండేది. ఆయన కుమారుడు ఫకీర్ అలీ, మాజీ భారత వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ కుమార్తెను వివాహం చేసుకున్నారు.క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత, అబిద్ అలీ మాల్దీవ్స్, యూఏఈ, ఆంధ్ర రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశారు. ఈ దిగ్గజ క్రికెటర్ మరణంతో హైదరాబాద్ క్రీడా వర్గాలు అభిమానులు, సహ ఆటగాళ్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.