డగౌట్ లో ఆర్చర్ నిద్ర ఇంగ్లాండ్ ను ఏకిపారేసిన పీటర్సన్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ భారత్ టూర్ కు రావడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్కి కనిపించింది. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడే మంత్రంగా ఆడుతున్న ఇంగ్లాండ్ , టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని అందరూ అంచనా వేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 06:35 PMLast Updated on: Feb 14, 2025 | 6:35 PM

There Is Criticism That England Has Come To Visit India Without Preparation

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ భారత్ టూర్ కు రావడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్కి కనిపించింది. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడే మంత్రంగా ఆడుతున్న ఇంగ్లాండ్ , టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని అందరూ అంచనా వేశారు. ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్ లో విధ్వంసకర ఆటగాళ్ళు ఉండడంతో హోరాహోరీ మ్యాచ్ లు తప్పవనుకున్నారు. కానీ పొట్టి క్రికెట్ లో తేలిపోయిన ఇంగ్లీష్ టీమ్ వన్డే ఫార్మాట్ లోనూ చేతులెత్తేసింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా 0-3తో వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. ఈ సిరీస్ మొత్తం ఐదు టీ ట్వంటీలు, 3 వన్డేలు కలిపి మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లీష్ టీమ్ కేవలం ఒకే ఒక్క విజయం మాత్రమే అందుకుంది. స్టార్ ప్లేయర్స్ అందరూ నిరాశపరిచారు. అయితే సరైన ప్రిపరేషన్ లేకుండా భారత్ పర్యటనకు ఇంగ్లాండ్ వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ విమర్శలు చేసింది ఎవరో కాదు ఆ దేశ మాజీ కెప్టెన్ పీటర్సన్… మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ ను పీటర్సన్ ఏకిపారేశాడు.

గత వారం తమ జట్టు కనీసం ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ పాల్గొనలేదని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. మొదటి వన్డే ముందు కూడా ప్రాక్టీస్‌ చేయలేదని తెలిసిందన్నాడు. కేవలం జోరూట్‌ మాత్రమే నెట్స్‌కు వచ్చాడన్న విషయం తెలిసి షాక్ కు గురయ్యానని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ చేయకుండా సిరీస్ ఎలా గెలుస్తారనుకున్నారో అర్థం కావడం లేదన్నాడు. ప్రాక్టీస్ సెషన్ కు వచ్చే ఉద్దేశం లేనప్పుడు భారత పర్యటనకు రాకూడదన్నాడు. ఎందుకంటే ఉపఖండం పిచ్‌లపై ఆడాలంటే సాధన చాలా అవసరమన్నాడు. ఏ క్రీడల్లోనైనా మంచి ప్రాక్టీస్‌ లేకపోతే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టమని పీటర్సన్ చెప్పాడు. గోల్ఫ్‌ ఆడేందుకు ఆసక్తి చూపించిన ప్లేయర్లు క్రికెట్‌ను ప్రాక్టీస్‌ చేయడంపై దృష్టిసారించలేకపోయారని పీటర్సన్ సెటైర్లు వేశాడు.

ఇంగ్లాండ్ క్రికెటర్లలో కొందరు వన్డే సిరీస్ కు ముందు గోల్ఫ్ ఆడేందుకు వెళ్ళారని తెలిసి పీటర్సన్ ఈ వ్యాఖ్యాలు చేశాడు. అటు భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఇంగ్లాండ్ పై విమర్శలు గుప్పించాడు. ఏ జట్టుకైనా నెట్ నెషన్ చాలా ముఖ్యమన్నాడు. ఇదిలా ఉంటే మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఆ టీమ్ డగౌట్ లోనే పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిద్రపోయాడు. ఇది చూసి రవిశాస్త్రి ఆ టీమ్ ను మరింత దారుణంగా ట్రోల్ చేశాడు. ఆ టీమ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ సందర్భంగా కెమెరాలు ఇంగ్లండ్ డగౌట్ వైపు తిరిగాయి. ఆ సమయంలో ఆర్చర్ ఓ కునుకు తీస్తూ కనిపించాడు. ఆ సమయంలో రవిశాస్త్రి కామెంటరీ బాక్స్ లో ఉన్నాడు. మంచిగా నిద్రపోయేందుకు ఇదే సరైన టైమ్ అంటూ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.