World Cricket : సిక్సర్ కొడితే ఔట్.. అక్కడ సిక్సర్లపై నిషేధం
ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం బ్యాటర్ల హవానే నడుస్తోంది. టీ ట్వంటీ ఫార్మాట్ కు ప్రాధాన్యత బాగా పెరిగిన వేళ బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ సిక్సర్లు కామన్ గా నమోదవుతుంటాయి.
ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం బ్యాటర్ల హవానే నడుస్తోంది. టీ ట్వంటీ ఫార్మాట్ కు ప్రాధాన్యత బాగా పెరిగిన వేళ బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ సిక్సర్లు కామన్ గా నమోదవుతుంటాయి. షార్ట్ ఫార్మాట్ లో అయితే చెప్పక్కర్లేదు. అభిమానులు కూడా భారీ సిక్సర్లను, బౌండరీలనే ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకచోట సిక్సర్లపై నిషేధం విధించారు. ఒకవేళ బ్యాటర్ ఆవేశపడి కొడితే పెవిలియన్ చేరాల్సిందే.. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నది క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లోనే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంగ్లాండ్ లోని సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టేడియంలో ఆటగాళ్లు ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని ఈ క్లబ్ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్‌ల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు తలెత్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితులు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.
సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ స్టేడియం వద్ద వలలను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తినడంతో పాటు చాలా మందికి గాయాలు కూడా అవుతున్నాయి. దీంతో క్లబ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాగా సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించడంతో పాటు మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఏ ఆటగాడైనా సిక్స్ కొడితే మొదటి తప్పుగా పరిగణించి పరుగులను లెక్కలోకి తీసుకోరు. రెండో సారి కూడా సిక్స్ కొడితే ఔట్‌గా ప్రకటిస్తారు. దీనిపై నెట్టింట్లో మీమ్స్ పేలుతున్నాయి. చిన్నప్పుడు చాలీ చాలని గ్రౌండ్స్ లో ఆడిన గల్లీ క్రికెట్ గుర్తొస్తుందంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.