వివాదాలకు కొదవ లేదు ఐపీఎల్ లో కాంట్రవర్సీలు ఇవే
ఐపీఎల్ అనగానే టీ ట్వంటీ స్టార్ బ్యాటర్ల విధ్వంసం... వరల్డ్ క్లాస్ బౌలర్ల అద్భుతమైన స్పెల్స్... జాంటీ రోడ్స్ ను గుర్తు చేసే ఫీల్డింగ్ విన్యాసాలు... ఇవే అనుకుంటే పొరపాటే... రికార్డులతో పాటు పలు వివాదాలకు కూడా ఐపీఎల్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

ఐపీఎల్ అనగానే టీ ట్వంటీ స్టార్ బ్యాటర్ల విధ్వంసం… వరల్డ్ క్లాస్ బౌలర్ల అద్భుతమైన స్పెల్స్… జాంటీ రోడ్స్ ను గుర్తు చేసే ఫీల్డింగ్ విన్యాసాలు… ఇవే అనుకుంటే పొరపాటే… రికార్డులతో పాటు పలు వివాదాలకు కూడా ఐపీఎల్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నుంచి భజ్జీ, శ్రీశాంత్ చెంపదెబ్బ… గంభీర్,కోహ్లీ పంచాయితీ వరకూ చాలానే ఉన్నాయి.ప్రతీ సీజన్ లో రసవత్తర సమరాలే కాదు పలు వాగ్వాదాలు, వివాదాలు జరుగుతూనే ఉంటాయి. గడిచిన 17 సీజన్లలో అనేక వివాదాలు జరిగాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఆటగాళ్ల సస్పెన్షన్, వాగ్వాదాలు ఇలా చాలానే జరిగాయి.
ఈ వివాదాలతో ఆటగాళ్ళు కూడా సస్పెండయ్యారు. ఆటగాళ్లు మాత్రమే కాదు ఆయా ప్రాంచైజీల యాజమాన్లు కూడా ఈ వివాదాలలో చిక్కుకున్నారు. 2013 లో ముంబై ఇండియన్స్ తరఫున హర్భజన్ సింగ్, పంజాబ్ తరఫున శ్రీశాంత్ ఆడారు. అయితే మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ ని హర్భజన్ చెంపదెబ్బ కొట్టడం పెద్ద దుమారం రేపింది. అనంతరం శ్రీశాంత్ అసభ్య పదజాలం వాడడం వల్లే హార్భజన్ చేయి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం హర్భజన్ పై బీసీసీఐ చర్యలు తీసుకొని అతడిని సీజన్ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ 2010లో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ కి గురయ్యాడు.
ఇక 2012లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఐపీఎల్ లో సంచలనం సృష్టించింది. ఈ వివాదానికి సంబంధింది సీఎస్కే జట్టు అధ్యక్షుడు గురునాథ్ ముయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ యాజమాని రాజ్ కుంద్రా పేరు స్పాట్ ఫిక్సింగ్ లో వచ్చింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిపైనా జీవితకాల నిషేధం విధించారు. అలాగే చెన్నై, రాజస్థాన్ జట్లను రెండు సీజన్ల పాటు సస్పెండ్ చేశారు. దీంతో పాటు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భద్రతా అధికారులతో షారుక్ ఖాన్ వాగ్వాదం కారణంగా ఆయన్ను స్టేడియంలోకి ప్రవేశించకుండా ఐదేళ్ల నిషేధం విధించారు.
లీగ్ ఫైనాన్షియల్ రూల్స్ ను నెరవేర్చలేకపోవడంతో అప్పటి డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీపైనా వేటు పడింది. ఇక ఐపీఎల్ సీజన్‌లో డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు రావడంతో పుణె వారియర్స్ ఆటగాళ్లు రాహుల్ శర్మ, వేన్ పార్నెల్‌లను కూడా ఇదే ఏడాది అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌బాచ్, ఒక అమెరికన్ మహిళ చేసిన వేధింపుల ఆరోపణలతో దిల్లీలో ఇదే ఏడాది అరెస్టయ్యాడు.
2013 సీజన్ లో విరాట్ కోహ్లీ – గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్సిబి, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరూ కొట్టుకునేలా కనిపించారు. కానీ అక్కడ ఉన్నవారు కలగజేసుకోవడంతో గొడవ సర్దుమనిగింది. వీరి గొడవకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతూనే వచ్చింది.
మరోవైపు 2019 సీజన్ లో పంజాబ్ స్పిన్నర్ అశ్విన్ చేసిన మన్కడింగ్ ఔట్ తీవ్ర వివాదాస్పదమైంది. రాజస్థాన్ తో మ్యాచ్ లో జోస్ బట్లర్‌ను మాన్‌కడింగ్ చేయడం ద్వారా పెవిలియన్ కు పంపాడు. ఈ ఔట్ క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు వచ్చాయి.
ఇక 2021 సీజన్ చెన్నై, ఢిల్లీ మ్యాచ్ చివరి ఓవర్‌లో నోబాల్ వివాదం తీవ్రదుమారాన్ని రేపింది. చెన్నై బౌలర్ బ్రేవో ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేశాడు. దీంతో అంపైర్ అనిల్ చౌదరి నోబాల్ ఇచ్చి, వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని వైడ్ ఇచ్చాడు. ఇది చాలా వివాదాస్పదమైంది.
2023 ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు,లక్నో మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతకుముందు కోహ్లీతో అఫ్గాన్ ప్లేయర్ నవీనుల్ హక్ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో తన యాటిట్యూడ్ కోహ్లీపై చూపించాడు. ఈ వరుస వివాదాలతో మైదానం మొత్తం హీటెక్కిపోయింది.