ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్లు వీళ్లే
ఐసీసీ టోర్నీలు ఎప్పుడు జరిగిన భారత ఆటగాళ్ళ ముద్ర గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే మెగా టోర్నీ అంటే చాలు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మన క్రికెటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉంటారు.

ఐసీసీ టోర్నీలు ఎప్పుడు జరిగిన భారత ఆటగాళ్ళ ముద్ర గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే మెగా టోర్నీ అంటే చాలు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మన క్రికెటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం టీమిండియా బ్యాటర్లలో చాలా మంది పరుగుల వరద పారించారు. టోర్నీ ఆరంభం నుంచీ మన స్టార్ బ్యాటర్లందరూ ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటుతున్నారు. రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత తరపున చాలా రికార్డులున్నాయి. ఈ క్రమంలో అత్యధిక పరుగులు చేసిన మన క్రికెటర్ల జాబితాలో శిఖర్ ధావన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మిస్టర్ ఐసీసీగా పేరున్న గబ్బర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ప్రతీసారీ అదరగొట్టాడు. అతడు 10 ఇన్నింగ్స్ లలో 77.88 సగటు, 102 స్ట్రైక్ రేట్ తో 701 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ విజేతగా నిలిచిన 2013 టోర్నీలో ధావన్ ఐదు మ్యాచ్ లలోనే 363 పరుగులు చేసాడు. ఈ ప్రదర్శనతోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గానూ నిలిచాడు.
అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అద్భుతమైన రికార్డుంది. ఈ మెగాటోర్నీలో గంగూలీ దాదాగిరీని ఫ్యాన్స్ మరిచిపోలేరు. దాదా 11 ఇన్నింగ్స్ లలో 73.88 సగటు, 83.22 స్ట్రైక్ రేట్ తో 665 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో గంగూలీ 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే మరో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. ద్రవిడ్ 15 ఇన్నింగ్స్‌లలో 48.23 సగటుతో 627 పరుగులు చేశాడు. దీనిలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టోర్నమెంట్ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో ద్రవిడ్ 3 స్థానంలో ఉన్నాడు.
ఇక ప్రస్తుత తరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్ జాబితాకు సంబంధించి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. మెగాటోర్నీ అంటే చాలు చెలరేగిపోయే కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో 12 ఇన్నింగ్స్‌లు ఆడి 88.16 సగటుతో529 పరుగులు సాధించాడు. అలాగే ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మంచి రికార్డుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడి 53.44 సగటుతో, 481 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఈ సారి కోహ్లీ, రోహిత్ కెరీర్ లో ఇదే చివరి ఐసీసీ టోర్నీగా భావిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ పరుగుల వరద పారించే అవకాశముంది.