WPL లో ఆర్సీబీ కథ ముగిసే ప్లే ఆఫ్స్ కు వెళ్ళిన జట్లు ఇవే

మహిళల ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 02:20 PMLast Updated on: Mar 10, 2025 | 2:20 PM

These Are The Teams That Made It To The Playoffs In The Wpl Where Rcbs Story Ends

మహిళల ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన యూపీ వారియర్స్‌.. పోతూపోతూ ఆర్సీబీని కూడా తీసుకెళ్లిపోయింది. తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆర్సీబీ.. యూపీ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. వరుసగా ఐదు ఓటములతో ఈ సీజన్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇది అత్యధిక స్కోర్. ఛేజింగ్ లో రిచా ఘోష్‌ పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో ఆర్సీబీ 19.3 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మృతి మంధాన విఫలమవడం కొంపముంచింది. చివర్లో స్నేహ రాణా విధ్వంసం సృష్టించినా జట్టును గెలిపించలేకపోయింది.

ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి వైదొలిగింది ఆర్సిబి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో ఐదు జట్లు పాల్గొంటే…. మూడు జట్లు ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకున్నాయి. మిగిలిన రెండు జట్లు ఇంటి దారి పట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత 8 పాయింట్లచో గుజరాత్… రెండో స్థానంలో నిలవగా..మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా 8 పాయింట్లతో… ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకోగలిగింది.

ఈ టోర్నీ ఆరంభం నుంచీ యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టర్ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్నట్టు కనిపించినా తర్వాత చేతులెత్తేసింది. ఏకంగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. వరుస ఓటములతో కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించగలిగింది . ఇక ముంబై రెండు మ్యాచ్ లు, గుజరాత్ జెయింట్స్‌ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా నేరుగా ఫైనల్ వెళ్లే జట్టు.. తెలిసిపోతుంది. అనంతరం ఎలిమినేటర్ ఆడే జట్లు ఖరారు అవుతాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. మొత్తం మీద డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగిన ఆటతీరు కనబరచడంలో తమ జట్టు విఫలమవడం ఆర్సీబీ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.