మెగాటోర్నీ సెమీస్ చేరే జట్లు ఇవే.. పాక్ కు అంత సీన్ లేదన్న జహీర్ ఖాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ కోసం జట్లన్నీ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. పాక్ వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తున్నారు.
![మెగాటోర్నీ సెమీస్ చేరే జట్లు ఇవే.. పాక్ కు అంత సీన్ లేదన్న జహీర్ ఖాన్ These Are The Teams That Will Reach The Semi Finals Of The Mega Tournament Zaheer Khan Says Pakistan Doesnt Have Much Of A Scene](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2025/02/M7NhCrOsnK4-HD.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ కోసం జట్లన్నీ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. పాక్ వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తున్నారు. దీంతో భారత్ మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోనూ, 23న పాకిస్థాన్ తోనూ, మార్చి 2న న్యూజిలాండ్ తోనూ తలపడుతుంది. టీమిండియా సెమీఫైనల్ , ఫైనల్స్ కు చేరితే దుబాయ్ లోనే ఈ మ్యాచ్ లు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. భారత్ టైటిల్ పోరుకు చేరకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే మెగాటోర్నీపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాలు పంచుకుంటున్నారు. సెమీఫైనల్ చేరే జట్లు ఏవో వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్టులపై స్పందించాడు.
ఈ మెగా టోర్నీలో భారత్ ఖచ్చితంగా సెమీఫైనల్ కు చేరుతుందని జహీర్ చెప్పాడు.
అలాగే ఆస్ట్రేలియా కూడా ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ చక్కగా రాణిస్తుందన్నాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ రికార్డ్ అద్భుతంగా ఉందనీ, ఆ జట్టు కూడా సెమీస్ కు అర్హత సాధిస్తుందని అంచనా వేశాడు. నాలుగో జట్టుగా సౌతాఫ్రికా సెమీ ఫైనల్ కు చేరడం ఖాయమని జహీర్ ఖాన్ విశ్లేషించాడు. ఇటీవల కాలంలో సఫారీలు వైట్-బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారని గుర్తు చేశాడు.
అయితే డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ కు మాత్రం సెమీస్ చేరే సీన్ లేదన్నాడు. పాకిస్థాన్ వన్డేల్లో నిలకడగా రాణించలేకపోతుందనీ, ఆ జట్టు సెమీస్ కు చేరుకోవడం కష్టమేనని అంచనా వేశాడు. కీలక ఆటగాళ్ళు ఫామ్ లో లేకపోవడం కూడా పాక్ కు సమస్యగా మారుతుందని చెప్పాడు. అయితే ఇటీవల రికీ పాంటింగ్, రవిశాస్త్రి మాత్రం పాక్ ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. సొంత మైదానాల్లో ఆడబోయే పాకిస్థాన్ నుంచి ప్రత్యర్థులకు సవాల్ విసురుతుందని చెప్పారు. అంచనాలకు దొరకకుండా ఆ జట్టు ప్రదర్శన చేస్తుందనీ , పెద్ద టోర్నీల్లో ఆ టీమ్ ను ఎప్పుడు తక్కువగా వేయకూడదని పాంటింగ్ అభిప్రాయపడగా… టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కూడా దీనిని అంగీకరించాడు.