బ్యాటింగ్ తోనే గెలవలేరు సన్ రైజర్స్ బౌలింగ్ సంగతేంటి ?
ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్ లో దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్ లో దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. హెడ్ , అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి రావడమే తరువాయి పరుగుల వరద పారింది. హయ్యస్ట్ స్కోర్ల రికార్డులు బద్దలయ్యాయి. వీరి ఫామ్ ను దృష్టిలో ఉంచుకునే సన్ రైజర్స్ కూడా వీరందరినీ రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా ఇషాన్ కిషన్ ను కూడా తీసుకుంది. దీంతో అంచనాలు రెట్టింపయ్యాయి. పైగా తొలి మ్యాచ్ లో వారి అంచనాలకు తగ్గట్టే చెలరేగిపోయిన సన్ రైజర్స్ బ్యాటర్లు రికార్డు స్థాయిలో మరోసారి 286 పరుగుల స్కోరు చేశారు. ఇంకేముంది ఈ సారి కప్పు కొట్టడం ఖాయం.. సన్ రైజర్స్ ను అడ్డుకోవడం ఇక ఎవరి వల్లా కాదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ మారిపోయింది. బ్యాటర్లు పర్వాలేదనిపించినా బౌలర్ల వైఫల్యంతో భారీస్కోరును సైతం కాపాడుకోలేకపోయారు. ఇక నాలుగో మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఛేదించలేక చతికిలపడ్డారు.
గత సీజన్‌లో దూకుడు మంత్రం వర్క్ చేయగా.. ఈ సీజన్ లో అది బెడిసి కొడుతోంది. తొలి మ్యాచ్ లో 286 పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ నిరాశ పరిచింది. మళ్లీ 200 మార్కును అందుకోలేకపోయింది.మ్యాచ్ మ్యాచ్ కు సన్ రైజర్స్ బ్యాటింగ్ దారుణంగా మారుతుంది. తొలి మ్యాచ్ లో 286 కొడితే.. రెండో మ్యాచ్ లో 191.. మూడో మ్యాచ్ లో 163.. ఇక కేకేఆర్ తో జరిగిన పోరులో 120 పరుగులు.నమ్మకం పెట్టుకున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లు దారుణంగా ఆడుతున్నారు. రీటెయిన్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ పేలవ ప్రదర్శన చేస్తున్నారు.ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ అతి పెద్ద సమస్యలో చిక్కుకుపోయింది. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, క్లాసెన్ లను భర్తీ చేసే ప్లేయర్లు జట్టులో లేరు.వేలంలో ప్లేయింగ్ ఎలెవెన్ పై ఫోకస్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్.. బ్యాకప్ ప్లేయర్స్ ను కొనడంలో ఫోకస్ పెట్టలేదు. గ్లెన్ ఫిలిప్స్, ఎయిడెన్ మార్క్రమ్, అజింక్యా రహానే లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం వచ్చినా.. వారిని పట్టించుకోలేదు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమిటంటే ఎప్పుడూ బ్యాటింగ్ తోనే మ్యాచ్ లు గెలిచేస్తామా అనేది… ప్రతీసారీ బ్యాటింగ్ తోనే విజయాలు దక్కవు… ఎంత భారీ స్కోరు చేసిన బౌలింగ్ కూడా మెరుగ్గా ఉంటేనే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలుగుతాం. ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ మాత్రం అత్యంత పేలవంగా ఉందనేది తొలి మ్యాచ్ నుంచే తెలిసిపోయింది. కమ్మిన్స్ , మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ పేస్ త్రయం ఒక్క మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. మ్యాచ్ చేజారిపోయిన తర్వాతే వికెట్లు తీసారు. ఫలితంగా ఈ సీజన్ లో అత్యంత చెత్త బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ క్రికెట్ లో టాప్ బౌలర్లుగా ఉన్న కమ్మిన్స్ , షమీ ఇంత పేలవంగా బౌలింగ్ చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఏదో బ్యాటింగ్ తో నెట్టుకొచ్చేద్దాం అనుకుంటే కుదరదని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చూస్తే చెప్పొచ్చు. బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉంటేనే విజయాలు అందుతాయి. ఇలాంటి బౌలింగ్ తో కొనసాగితే మాత్రం ఈ సారి లీగ్ స్టేజ్ నుంచే సన్ రైజర్స్ ఇంటిదారి పట్టడం ఖాయమని చెప్పొచ్చు.