ఇదేం బౌలింగ్..అదేం బ్యాటింగ్, సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్
ఈ సారి 300 పక్కా... ఇక ఐపీఎల్ లో రికార్డు స్కోర్లు ఖాయం... రాసిపెట్టుకోండి ఫైనల్ కు వెళ్ళేది సన్ రైజర్సే... ఇదీ ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయం...

ఈ సారి 300 పక్కా… ఇక ఐపీఎల్ లో రికార్డు స్కోర్లు ఖాయం… రాసిపెట్టుకోండి ఫైనల్ కు వెళ్ళేది సన్ రైజర్సే… ఇదీ ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయం… వారి అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ రెచ్చిపోయింది. 286 పరుగుల భారీస్కోరు చేసి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చింది. కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ మొత్తం రివర్సయింది. సొంతగడ్డపై లక్నో చేతిలో చిత్తుగా ఓడింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పైనా పరాజయం పాలైంది. ఇప్పుడు మూడో మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ చేతిలోనూ ఓడిపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 300 సంగతి తర్వాత ముందు మ్యాచ్ గెలవండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
300 స్కోరు పక్కనపెడితే అందులో సగం కూడా జట్టు చేయలేకపోతంది. కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత కావ్య మారన్ జట్టును ఇప్పుడు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో అక్కడ భారీ పరుగులు చేస్తున్నారని.. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ కు పేరుగాంచిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో చాలా పేలవంగా బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అటు బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి.
మ్యాచ్ ఆరంభంలో కేకేఆర్ ఓపెనర్లను వెంటవెంటనే ఔట్ చేసినా తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు తేలిపోయారు.కెప్టెన్ కమిన్స్ , మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ ముగ్గురూ ఘోరంగా విఫలమయ్యారు. ఓవర్ కు 11 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. చివరి ఐదు ఓవర్లలో కోల్ కత్తా 78 పరుగులు చేసిందంటే సన్ రైజర్స్ బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోంది. నిజానికి సీజన్ తొలి మ్యాచ్ నుంచి హైదరాబాద్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది. ప్రతీ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. సొంతగడ్డపై లక్నో బ్యాటర్లు సైతం సన్ రైజర్స్ బౌలింగ్ ను ఉతికారేశారు. ఢిల్లీ బ్యాటర్లు కూడా హైదరాబాద్ బౌలింగ్ ను ఆటాడుకున్నారు. తాజాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ సైతం హైదరాబాద్ బౌలింగ్ ను చీల్చిచెండాడింది. కమ్మిన్స్ , షమీ, హర్షల్ పటేల్ పేస్ త్రయం అటు పవర్ ప్లేలోనూ ఫెయిలై.. డెత్ ఓవర్స్ లోనూ ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు సన్ రైజర్స్ కు బ్యాటింగే అతిపెద్ద బలం.. కానీ రెండో మ్యాచ్ నుంచీ బ్యాటింగే బలహీనతగా మారింది. హెడ్ , ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ రెడ్డి ఏ ఒక్కరూ కూడా అంచనాలకు అందుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. మళ్లీ 300 లోడింగ్ అంటూ కామెంట్లు చేయొద్దని సలహా ఇస్తున్నారు.