ఆ జట్ల మధ్యే ఫైనల్. గిబ్స్ అంచనా ఇదే…!
ఛాంపియన్స్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతానికి గ్రూప్ ఏ నుంచి మాత్రమే సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. టైటిల్ ఫేవరెట్ టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతుండగా..

ఛాంపియన్స్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతానికి గ్రూప్ ఏ నుంచి మాత్రమే సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. టైటిల్ ఫేవరెట్ టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతుండగా.. మరో టాప్ టీమ్ న్యూజిలాండ్ కూడా సెమీస్ లో అడుగుపెట్టింది. అటు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ కు వెళతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఏ జట్లు ఫైనల్స్ కు చేరతాయన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం టోర్నీలో టీమిండియానే ఫైనల్ రేసులో ముందుందని చాలా మంది చెబుతున్నారు. మిగిలిన జట్లతో పోలిస్తే స్ట్రాంగ్ గా ఉన్న భారత్ టైటిల్ గెలుస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. భారత్ బలమైన జట్టుగా ఉందని, ఫైనల్స్‌లో అడుగు పెడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదన్నాడు. ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే జట్టు దక్షిణాఫ్రికా అవుతుందని అంచనా వేశాడు గిబ్స్.
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు మంచి పొజీషన్‌లో ఉందని గిబ్స్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లల్లో తడబడే చరిత్ర దక్షిణాఫ్రికాకు ఉందని, ఆ విషయంపై తాము అప్రమత్తంగా ఉన్నామన్నాడు. దాన్ని ఈ సారి సరిదిద్దుకోగలమని ధీమాగా చెప్పాడు. ఫైనల్స్‌లో భారత్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. వర్షం వల్ల ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడలేకపోవడం కొద్దిగా నిరాశకు గురి చేసిందన్నాడు. గిబ్స్ అంచనాపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మరోసారి భారత్ చేతిలో సఫారీలకు భంగపాటు తప్పదేమోనంటూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపైనే భారత్ గెలిచి ఛాంపియన్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ పై 3-0తో వన్డే సిరీస్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరెట్ గా వచ్చిన రోహిత్ సేన అంచనాలకు తగ్గట్టే అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైనా, రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ పైనా విజయాలను అందుకుంది. ఇప్పుడు గ్రూప్ స్టేజ్ లో చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడబోతోంది. కివీస్ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది.భారత్, కివీస్ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ ఏలో టాపర్ గా నిలుస్తుంది. అన్ని మ్యాచ్ లు గెలిచే సెమీఫైనల్ కు రెడీ అవ్వాలని భావిస్తున్న భారత్ కివీస్ పైనా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.