ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం మెగాటోర్నీకి భారత తుది జట్టు ఇదే
సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అయింది. ఈ మెగాటోర్నీకి ముందే భారత తుది జట్టు కూర్పుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టు కనిపిస్తోంది.

సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అయింది. ఈ మెగాటోర్నీకి ముందే భారత తుది జట్టు కూర్పుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్లే మరోసారి కీలకం కానున్నారు. ఇంగ్లీష్ టీమ్ పై 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో అదరగొట్టిన వారంతా మెగాటోర్నీలో జరిగే తొలి మ్యాచ్ లో దాదాపుగా ఉన్నట్టే. ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతోనే టీమిండియా బరిలోకి దిగడం ఖాయమైంది. ఫిబ్రవరి 20న జరిగే తొలి మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాళ్ళంతా ఫామ్ లోకి వచ్చారు.
పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా లయను అందుకున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి రాగా.. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
ముఖ్యంగా గిల్ రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. బ్యాటింగ్ పరంగా భారత్ కు ఎటువంటి ఇబ్బందులు లేకున్నా బౌలింగ్ లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరమవ్వడం ఒక్కటే ఎదురుదెబ్బ. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరికి పెద్దగా అనుభవం లేకపోవడం టీమిండియాకు బలహీనతగా మారింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో ఉన్నా మునపటిలా బౌలింగ్ చేయకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. గాయంతో దాదాపు 15 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తోనే భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ఆడినా స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. కానీ అతని అనుభవం జట్టుకు బలంగా మారుతుందని టీమిండియా భావిస్తోంది.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి కోటా ఓవర్లను బౌలింగ్ చేస్తుండటం టీమిండియాకు అడ్వాంటేజ్‌గా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కొనసాగించిన కాంబినేషన్‌నే టీమిండియా మేనేజ్‌మెంట్ దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే ఛాన్స్ ఉంది. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. రెండో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్, షమీ మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశ్ తో పోరు తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తోనూ, మార్చి 2న న్యూజిలాండ్ తోనూ రోహిత్ సేన తలపడబోతోంది.