ఫైనల్ కు విన్నింగ్ కాంబినేషనే, భారత తుది జట్టు ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. 2013 తర్వాత ఈ టైటిల్ గెలవని టీమిండియా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. 2013 తర్వాత ఈ టైటిల్ గెలవని టీమిండియా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన రోహిత్ సేన ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భారత తుది జట్టుకు సంబంధించి ఎక్కువ మార్పులు జరగలేదు. స్టార్ పేసర్ బుమ్రా లేకున్నా సీనియర్ పేస్ షమీ రాణిస్తుండడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఎక్కువగా స్పిన్నర్లతోనే విజయాలు సాధిస్తోంది. దుబాయ్ పిచ్ స్లో బౌలర్లకే అనుకూలిస్తుండడంతో టైటిల్ పోరులోనూ స్పిన్నర్లే కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఎలాగైనా ఈ తుది పోరులో విజయం సాధించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ బలమైన ఫైనల్ ఎలెవన్ తోనే బరిలోకి దిగబోతోంది.
రోహిత్ శర్మ, గిల్ తమ ఓపెనింగ్ బాధ్యతను కొనసాగిస్తారు. కోహ్లీ నెం.3లో రాగా, శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పటేల్ వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో వస్తారు. జడేజా ఎనిమిదో స్థానంలో దిగుతాడు. మరోసారి నలుగురు స్పిన్నర్లుతోనే భారత బౌలింగ్ కాంబినేషన్ ఉండబోతోంది. షమీ, హార్దిక్ పాండ్యతో కలిసి పేస్ బాధ్యతల్ని పంచుకుంటాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను తీసుకుంటారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అదరగొడుతుండగా… అక్షర్ పటేల్, జడేజా కూడా రాణిస్తున్నారు. కానీ కుల్దీప్ ఇప్పటి వరకూ పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. తుదిపోరులో అతను సత్తా చాటితే ఇక తిరుగులేనట్టే.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు మ్యాచుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన భారత్, అనూహ్యంగా కివీస్ పై నలుగురిని రంగంలోకి దించింది. దీంతో అద్భుతమైన ఫలితం సాధించింది. ఇందులో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు కాగా, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. అంతర్జాతీయ కెరీర్ లో కేవలం రెండో వన్డే మాత్రమే ఆడిన వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు.వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ ఫైట్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరుగుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తుండటంతో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగానే ఆడుతోంది. అటు విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు రోహిత్. గంభీర్ ఏ మాత్రం సిద్ధంగా లేకపోవడంతో ఆసీస్ పై ఆడిన జట్టే ఫైనల్లోనూ బరిలోకి దిగబోతోంది. దీంతో అర్షదీప్ సింగ్, రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.