ఈ సారి భారత కెప్టెన్ల హవా 9 జట్లను నడిపించేది మనోళ్ళే

దేశవాళీ క్రికెట్ లో యువ ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ ను తీసుకొచ్చింది బీసీసీఐ... వారి లక్ష్యాలకు తగ్గట్టుగానే ఈ 17 ఏళ్ళు ఎంతోమంది యంగస్టర్స్ వెలుగులోకి వచ్చారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2025 | 04:20 PMLast Updated on: Mar 15, 2025 | 4:20 PM

This Time The Indian Captains Mood Is That It Will Be Manola Who Will Lead The 9 Teams

దేశవాళీ క్రికెట్ లో యువ ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ ను తీసుకొచ్చింది బీసీసీఐ… వారి లక్ష్యాలకు తగ్గట్టుగానే ఈ 17 ఏళ్ళు ఎంతోమంది యంగస్టర్స్ వెలుగులోకి వచ్చారు… అంతర్జాతీయ క్రికెట్ లోనూ మెరిసారు.. అదే సమయంలో ఐపీఎల్ లో పలు జట్లకు సారథులుగానూ మనోళ్ళే సత్తా చాటుతున్నారు. చాలా సీజన్ల తర్వాత ఐపీఎల్ జట్లకు కెప్టెన్సీ చేసే విషయంలో స్వదేశీ ఆటగాళ్ళదే పైచేయిగా ఉంది. 2025 ఐపీఎల్ సీజన్ లో ఆడుతున్న 10 జట్లలో 9 జట్లకు భారత ఆటగాళ్ళే సారథ్యం వహిస్తుండగా… ఒక జట్టుకు విదేశీ ప్లేయర్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సారి పేరుకు తగ్గట్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ భారత జట్టు ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎడిషన్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్‌లుగా ఉన్నారు. గతేడాది ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఈసారి ఆ సంఖ్య కేవలం ఒక జట్టుకే పరిమితమైంది. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమే విదేశీ ఆటగాడిని కెప్టెన్‌గా నియమించింది. మిగతా 9 జట్లూ కూడా భారత ఆటగాళ్లకే బాధ్యతలు అప్పగించాయి.

గతేడాది జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపించిన.. రుతురాజ్ గైక్వాడ్.. ఈసారి కూడా జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ ను హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లడంతో ఐపీఎల్ 2024కు ముందు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. అతడే ఈ ఎడిషన్‌లో కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ ను గత సీజన్ లో శిఖర్ ధావన్‌ నడిపించాడు. ధావన్ రిటైరవ్వడంతో ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఈ సారి కొత్త సారథి వచ్చాడు. గతేడాది వరకూ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ వదిలేసింది. ఈ సీజన్ నుంచి రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా కొత్త కెప్టెన్ సారథ్యంలోనే బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. దీంతో అజింక్య రహానే‌ కోల్ కత్తా సారథిగా ఎంపికయ్యాడు. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ను కేఎల్ రాహుల్ నడిపించాడు. మెగావేలానికి ముందు రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ వదిలేయగా.. ఈ సీజన్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. అదే సమయంలో పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త సారథిగా అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించింది. కాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్, లీగ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ సారథిగా హార్థిక్ పాండ్యానే కొనసాగనున్నారు.

మెగా వేలానికి ముందు కొన్ని జట్లు ఏకంగా కెప్టెన్లనే వేలంలోకి వదిలేశాయి. దీంతో ఆయా జట్లకు కొత్త కెప్టెన్‌ల ఎంపిక అనివార్యమైంది. అయితే లీగ్‌లో పాల్గొనే పది జట్లలో 9 జట్లు ఇది వరకే తమ కెప్టెన్లను ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. తాజాగా ఆ జట్టు కూడా తమ కెప్టెన్‌ను ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తమ జట్టును నడిపించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈసారి లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ తమ కెప్టెన్లను ప్రకటించినట్లయింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.