ఆ ముగ్గురే మాకు డేంజర్… భారత్ తో సిరీస్ పై ఆసీస్ స్పిన్నర్
వరల్డ్ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడుతున్నాయంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజే వేరు... డిసెంబర్ లో జరగనున్న భారత్, ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఇటువంటి ఆసక్తే ఉంది.
వరల్డ్ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడుతున్నాయంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజే వేరు… డిసెంబర్ లో జరగనున్న భారత్, ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఇటువంటి ఆసక్తే ఉంది. గత రెండు పర్యాయాలు తమ సొంతగడ్డపై టీమిండియా సిరీస్ గెలవడంతో కంగారూలకు వణుకు పుడుతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ జైత్రయాత్రకు బ్రేక్ వేయాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ పై పలువురు ఆసీస్ క్రికెటర్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా టీమిండియాలో ముగ్గురు ప్లేయర్స్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందంటూ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ నుంచి ఆసీస్ కు ముప్పేనని అంగీకరించాడు.
హిట్ మ్యాన్ కు ఆసీస్ పై మంచి రికార్డే ఉందన్న నాథన్ లయన్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నాడు. తమపై అతను ఎన్నోసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడని గుర్తు చేసుకున్నాడు. కొన్నిసార్లు కోహ్లీని రెచ్చగొట్టి తమ జట్టు మూల్యం చెల్లించుకుందని వ్యాఖ్యానించాడు. ఈ ముగ్గురూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు కీలకం కానున్నారని అంచనా వేశాడు. అలాగే గిల్, జైశ్వాల్, జడేజా కూడా ఇండియాకు ట్రంప్ కార్డ్స్ గా మారిపోయారని ఈ ఆసీస్ స్పిన్నర్ విశ్లేషించాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ లో జరుగుతుంది.