ఇది కదా క్రేజ్ అంటే గంటలోనే టికెట్లన్నీ ఖతమ్
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య సమరానికి ఉండే క్రేజే వేరు... అది ఫార్మాట్ ఏదైనా, ఆడేది ఎక్కడైనా ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన క్రికెట్ దేశాల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాయాదుల సమరం అంటే కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు అంతకుమించి..
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య సమరానికి ఉండే క్రేజే వేరు… అది ఫార్మాట్ ఏదైనా, ఆడేది ఎక్కడైనా ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన క్రికెట్ దేశాల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాయాదుల సమరం అంటే కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు అంతకుమించి…. ఇక్కడ ఆట కంటే ఆటగాళ్ళ భావోద్వేగాలే అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా అటు స్టేడియం హౌస్ ఫుల్… ఇటు వ్యూయర్ షిప్ లోనూ సరికొత్త రికార్డులు బద్దలవుతాయి. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపుడుతున్నాయి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరం ఫ్యాన్స్ ను అలరించబోతోంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో రెండు జట్లు తలపడబోతున్నాయి.
ఈ మ్యాచ్ కు క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువైంది. భారత్, పాక్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ గంటల్లోనే అమ్ముడయ్యాయి. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను సోమవారం సాయంత్రం ఆన్‌లైన్ వేదికగా అందుబాటులోకి తీసుకురాగా.. నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. గరిష్ట టికెట్లు 47 వేలు, 1.20 లక్షల టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. భారత్-పాక్ మ్యాచ్‌కు ఇరు దేశాల అభిమానులే కాదు సెలెబ్రిటీలు సైతం భారీ సంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలోనే భారీ ధర కలిగిన టికెట్లు కూడా నిమిషాల్లోనే సేల్ అయిపోయాయి. ఇతర మ్యాచ్‌ల టికెట్లన్నీ 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ. 10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా నిర్ణయించారు.
దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుండడంతో ఇటు భారత్ నుంచి , అటు పాకిస్థాన్ నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఇప్పటికే దుబాయ్ లోని హోటల్స్ అన్నీ ఈ మ్యాచ్ కు ముందు రోజులు పూర్తిగా బుక్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దుబాయ్ హోటల్స్ కూడా రేట్లు పెంచేసినట్టు సమాచారం. అయినప్పటకీ ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలన్న అభిమానులు కోరికను ఇవేమీ ఆపే అవకాశం లేదు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ , పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ లో ఉండగా..గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్-పాక్ తలపడటం ఇదే తొలిసారి. మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలనే ఒప్పందం చేసుకున్నాయి.