తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్, ఆ నిర్ణయమే కొంపముంచిందా ?
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆట మారలేదు. ఒక విజయం తర్వాత జోరు కొనసాగిస్తుందనుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలుపు ముంగిట బోల్తా పడింది.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆట మారలేదు. ఒక విజయం తర్వాత జోరు కొనసాగిస్తుందనుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలుపు ముంగిట బోల్తా పడింది. ఈ మ్యాచ్ లో ముంబై మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు ఓటమికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్ష్య ఛేదనలో మరో ఏడు బంతులు మిగిలి ఉండగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ విషయంలో ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటికే 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను.. 18.5 ఓవర్‌లో అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ చేసింది. కానీ ముంబయి తీసుకున్న ఈ నిర్ణయం బోల్తా కొట్టింది. ముంబయి ఓటమి పాలైంది. ఓటమి తర్వాత తిలక్ వర్మ విషయంలో ముంబయి తీసుకున్న ఈ రిటైర్ ఔట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ గెలవడం కోసం ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిడంతో.. హర్భజన్ సింగ్, సునీల్ గావస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ముంబయి జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయి జట్టు తాము తీసుకున్న ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చింది.
మ్యాచ్ అనంతరం తిలక్ రిటైర్డ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. తమకు కొన్ని భారీ షాట్లు అవసరమయ్యాయనీ,. కానీ తిలక్ వర్మ ధాటిగా ఆడలేకపోయాడని హార్థిక్ చెప్పాడు. క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్న హార్థిక్ ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు అనుకున్నవి జరగవన్నాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్థమై ఉంటుందని భావిస్తున్నట్టు హార్దిక్ వివరణ ఇచ్చాడు. మరోవైపు కోచ్ జయవర్థనే కూడా తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. తిలక్ వర్మ.. తాము ఆశించిన స్థాయిలో ధాటిగా ఆడలేకపోయాడన్నాడు. ఫైనల్ ఓవర్ల వరకు అతడి నుంచి భారీ షాట్ల కోసం ఎదురుచూసినట్లు తెలిపాడు. కానీ అది జరగలేదని, అందుకే కొత్త బ్యాటర్ ను బరిలోకి దింపాల్సి వచ్చిందని చెప్పాడు. తిలక్ వర్మ రిటైర్ చేయాలనేది తన నిర్ణయం అని చెప్పుకొచ్చాడు.
వికెట్లు కోల్పోయినప్పుడు జట్టు కోసం తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడనీ,. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడని ప్రశంసించాడు. అతడు మరింతగా రాణించడానికి ప్రయత్నించినా అలా జరగలేదన్నాడు.. మ్యాచ్ చివరి ఓవర్ల వరకు అతడు ధాటిగా ఆడతాడని ఎదురుచూశామనీ, కానీ అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడనీ చెప్పాడు. దీంతో కొత్త బ్యాటర్ ఎవరైనా ఆడితే బాగుంటుందని ఆశించామన్నాడు. అలా ఒకరిని మధ్యలోనే బయటకు పంపించడం కరెక్ట్ కాదని తెలుసన్నాడు. ఆ సమయంలో కేవలం ఆట కోసం తీసుకున్న నిర్ణయంగా జయవర్ధనే చెప్పుకొచ్చాడు.