WTC Final: మొన్న ధోనీ కోటా.. నిన్న కోహ్లీ కోటా.. నేడు రోహిత్ కోటా! లాబీ రాజకీయాలకు అడ్డా టీమిండియా
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఫ్రెండ్‌షిప్ కోటానేనని రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు.
ఫేవరెటిజానికి.. ఫలానా ప్లేయర్ జట్టులో ఉండాలని కెప్టెన్ కోరడానికి చాలా తేడా ఉంది. ధోనీనే కావాలని 2004లో గంగూలీ పట్టుపట్టాడట..అందుకే సెలక్టర్లు మహేంద్రుడిని తీసుకున్నారట.. ఇది అందిరికి తెలిసిన కథే..! 2007 వన్డే ప్రపంచ కప్ ఓటమి తర్వాత ద్రవిడ్ కెప్టెన్సీని వదులుకున్నాడు.. ఆ టైమ్‌లో యువరాజ్ లేదా సెహ్వాగ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావించింది..అయితే సచిన్ మాత్రం ధోనీకి కెప్టెన్సీ ఇవ్వాలని కోరడం.. బీసీసీఐ దానికి ఒప్పుకోవడం…ఆ తర్వాత ధోనీ సారథ్యంలో టీమిండియా 2007టీ20 ప్రపంచ కప్ గెలవడం చకాచకా జరిగిపోయాయి.
ఇక్కడ గంగూలీ కానీ, సచిన్ కానీ చేసింది ఫేవరెటిజం కాదు.. ఆ మాటకొస్తే దాదాకు ధోనీకి అంతకముందు ఎలాంటి పరిచయమూ లేదు..! ఇక ధోనీ కంటే సచిన్‌కు సెహ్వాగ్,యూవీనే ఎక్కువ.. ఎందుకంటే అప్పటికే వాళ్లంతా మంచి స్నేహితులు..ఇదంతా జట్టు అవసరాల కోసం అప్పుడు సీనియర్ ప్లేయర్లు చేసిన సిఫార్సులు..! అయితే తర్వాత అన్నీ మారిపోయాయి. టీమిండియాలోకి అనధికారిక కోటాలు వచ్చి చేరాయి. తాజాగా WTC ఫైనల్‌కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ని తీసుకోవడంతో రోహిత్ ఫేవరెటిజం చూపించాడంటూ అతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో జరిగిన లాబీ పాలిటిక్స్‌పై అభిమానులు చర్చించుకుంటున్నారు.
2011ప్రపంచకప్ వరకు అంతే ఓకే:
టీమిండియా 2011వన్డే ప్రపంచకప్ అత్యుత్తమ టీమ్‌తో ఆడింది. అందుకే ట్రోఫి గెలవగలిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. కెప్టెన్ ధోనీతో సెహ్వాగ్, గంభీర్‌కు అంత పడడంలేదన్న వార్తలు గుప్పుమన్నాయి. 2012 ఆస్ట్రేలియాలో జరిగిన సీబీ సిరీస్‌తో అవి బయటపడ్డాయి. రొటేషన్ పాలిసీ అంటూ సెహ్వాగ్, గంభీర్, సచిన్‌లలో ఒకరిని ధోనీ ప్రతి మ్యాచ్‌కు పక్కనపెడుతూ వచ్చాడు. దీంతోపై సెహ్వాగ్, గంభీర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి సెహ్వాగ్ ఫామ్ కోల్పోయాడు. అప్పుడు టెస్టు జట్టుల్లో ఓపెనర్ స్థానం కోసం మురళి విజయ్‌ను ఎంపిక చేశారు. నిజానికి అంతకముందు నుంచే అతను టీమిండియాలో భాగంగా ఉన్నాపెద్దగా రాణించింది లేదు. అయితే విజయ్ సెట్ అయ్యేవరకు ధోనీ అతడినే కొనసాగించాడు. దీంతో సెహ్వాగ్ స్థానం గల్లంతైంది.
మురళి విజయ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కావడంతోనే ధోనీ ఇలా చేశాడన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి.. అందుకే విజయ్ వరసపెట్టి విఫలమవుతున్నా ఛాన్సులు ఇచ్చాడన్న విమర్శలు ఉన్నాయి. ఇక ధోనీ కెప్టెన్‌గా ఉన్న 2012-15కాలంలో 11మంది ప్లేయర్లలో ఐదుగురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లే ఉండేవారన్న విమర్శలున్నాయి. ధోనీ, అశ్విన్, రైనా, జడేజా, మోహిత్ శర్మ వన్డే జట్టుల్లో ఉండేవారు. అటు టెస్టుల్లో మురళి విజయ్.. ఇలా చెన్నై కోటా ప్లేయర్లే 40శాతం టీమ్‌లో ఉండడంతో అప్పట్లో ధోనీపై మిగిలిన ఫ్రాంచైజీ జట్ల ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారు.
కోహ్లీ కోటా:
ధోనీతో కంపేర్ చేస్తే కోహ్లీ ఈ విషయంలో కొంచెం బెటర్ అన్నది ఫ్యాన్స్ అభిప్రాయం. కొచ్‌గా రవిశాస్త్రి ఉండాలని కోహ్లీ పట్టడం తప్ప అతను లాబీ రాజకీయాలు చేసింది చాలా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతుంటారు. కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ల కోసం మాత్రం ఫ్రెండ్‌షిప్ కోటాలో అవకాశాలు ఇచ్చాడన్న విమర్శలున్నాయి. అయితే కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో రాహుల్ అంత తీసికట్టుగా ఆడింది లేదు. ఇప్పుడంటే స్టాట్‌ప్యాడ్ ఇన్నింగ్స్‌లతో చిరాకు తెప్పిస్తున్నాడు కానీ.. అప్పట్లో రాహుల్ బాడీ లాంగ్వేజ్ వేరు. అయితే కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత పూర్తిగా తన ట్రేడ్ మార్క్ టీమ్ ఉండేలాగా చూసుకున్నాడంటారు ఫ్యాన్స్. అందుకే తన ఆర్సీబీ టీమ్ ఆటగాడు చహల్‌కు అశ్విన్ స్థానంలో వన్డేల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఇక మరో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కి చాన్సులు ఇచ్చాడు. ధోనీకి జడేజా, అశ్విన్ ఎలాగో..కోహ్లీకి ఈ జోడి అలా అన్నమాట..ఇదంతా ఫ్యాన్స్ ఫీలింగ్..! నిజాలేంటో ఎవరికి తెలియదు!
ముంబై లాబీ పోయి ముంబై ఇండియన్స్ కోటా వచ్చే:
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీపై మ్యాచ్ సందర్భంగా లక్నో కెప్టెన్ రాహుల్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను ఈ సీజన్‌తో పాటు వచ్చే నెల 7న ప్రారంభం కానున్న ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో టెస్టు జట్టులోకి ఇషాన్ కిషన్‌ని తీసుకోవడంపై అన్నీవైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వన్డేలో డబుల్ సెంచరీ బాదిన తర్వాత ఇషాన్ కిషన్ వరుసపెట్టి విఫలవయ్యాడు.. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను నట్టేట ముంచే ఇన్నింగ్స్‌లు ఆడాడు. నిలకడలేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్‌ను WTC ఫైనల్‌కు సెలెక్ట్ చేయడం పట్ల రోహిత్ ఫ్యాన్సే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్టాండ్‌బై ఆటగాడిగా సూర్యకుమార్‌యాదవ్‌ని సెలెక్ట్ చేయడం చూస్తుంటే రోహిత్ ఫ్రెండ్‌షిప్ కోటా లిమిట్ దాటిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. ఏకంగా 82 యావరేజ్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. గత రంజీ సీజన్‌లో 92యావరేజ్‌తో దుమ్మురేపాడు. డాన్ బ్రాడ్‌మెన్‌కి తప్ప ఎవరికీ లేని సగటు అది. ఒకప్పుడు టీమిండియాను ముంబై లాబీ ఏలేదన్న ఆరోపణలు ఉండేవి.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్‌ను అసలు బీసీసీఐ పట్టించుకోవడంలేదు. టెస్టులకు పనికొస్తోడో లేదో తెలియని ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం కనిపిస్తున్నారు. ఈ మాత్రం దానికి రంజీలు ఎందుకని.. కేవలం ఐపీఎల్ ద్వారానే జట్టులోకి తీసుకునే లెక్క అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను తీసిపడేయమంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అది కూడా రోహిత్ శర్మ ఫ్రెండ్స్‌నే తీసుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు.