Ashes 2023: ఇంగ్లండ్‌ చేసిన ఆ తప్పిదమే ఆస్ట్రేలియా గెలిచేలా చేసింది.. బజ్‌బాల్‌తో బొక్క బోర్లా..!

మేము ప్రతిసారీ ఇలానే ఆడుతాం.. ఇలానే గెలుస్తామంటే కుదరదు. పసికూనపై, సొంతగడ్డలపై, బ్యాటింగ్‌ పిచ్‌లపై అటాకింగ్‌ బ్యాటింగ్‌ అప్రోచ్‌తో విజయాలు సాధించినంత మాత్రాన.. ఆస్ట్రేలియాపై కూడా అలానే విక్టరీ కొడతామని అత్యాశకు పోతే ఎలా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 21, 2023 | 08:55 AMLast Updated on: Jun 21, 2023 | 8:55 AM

Unsustainable Bazball Brand Already Showing Signs Of Fatigue Australia Won First Test In Ashes Against England

Ashes 2023: ప్రతిసారీ ఒక్కటే ఫార్ములా వర్క్‌ అవుట్ అవ్వదు. బజ్‌బాల్‌ అయినా.. గిజ్‌బాలైనా అన్నీ వేళలా సక్సెస్‌ అవ్వదు. ఈ మాత్రం తెలుసుకోలేకపోయిన ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాకు విక్టరీ సమర్పించుకుంది..!
పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. సందర్భాన్ని బట్టి గేమ్‌ స్ట్రాటజీని ఛేంజ్‌ చేసుకోవాలి. అంతేకానీ మేము ప్రతిసారీ ఇలానే ఆడుతాం.. ఇలానే గెలుస్తామంటే కుదరదు. పసికూనపై, సొంతగడ్డలపై, బ్యాటింగ్‌ పిచ్‌లపై అటాకింగ్‌ బ్యాటింగ్‌ అప్రోచ్‌తో విజయాలు సాధించినంత మాత్రాన.. ఆస్ట్రేలియాపై కూడా అలానే విక్టరీ కొడతామని అత్యాశకు పోతే ఎలా..? క్రికెట్‌లో కొత్త తరహా(బజ్‌బాల్‌) స్టైల్‌కి నాంది పలికిన ఇంగ్లండ్‌ జట్టు.. ఆస్ట్రేలియాపై బొక్క బోర్లా పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ చేసిన ఆ తప్పిదమే ఓటమికి కారణమైంది. ఇంతకీ ఇంగ్లండ్‌ చేసిన తప్పేంటి..? ఏంటీ బజ్‌బాల్‌ క్రికెట్..?
బజ్‌బాల్‌ క్రికెట్ అంటే..?
బజ్‌బాల్‌ అంటే ఒక్కమాటలో చెప్పాలంటే టెస్టుల్లో దూకుడుగా ఆడడం! నిజానికి టెస్టులు చాలా నిదానంగా సాగుతాయి. ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్‌ లెజెండ్‌ బ్రాండెన్‌మెకల్లమ్‌ ఎన్నికైనప్పటి నుంచి ఈ తరహా క్రికెట్‌ని ఇంగ్లిష్‌ ప్లేయర్లు ఆడడం మొదలుపెట్టారు. ESPN క్రిక్ ఇన్ఫో జర్నలిస్ట్ ఆండ్రూ మిల్లర్ తొలిసారిగా ఈ పేరును కాయిన్‌ చేశారు. మెకల్లమ్‌ ముద్దు పేరు బజ్‌. దూకుడు ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు, కావాలంటే ఓ 20 రన్స్‌ లీక్‌ చేసుకోనైనా వికెట్ తీయ్యడం ఈ స్టైల్ స్పెషాలిటీ. అటు బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌ లెవల్‌లో అగ్రెసివ్‌గా ఆడాలి. అందుకే మెకల్లమ్‌ హెడ్‌కోచ్‌గా ఎన్నికైన తర్వాత ఇంగ్లండ్‌ టెస్టుల్లో 77 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తోంది. సహజంగా స్లోగా బ్యాటింగ్‌ చేసే ఈ తరం గ్రేట్స్‌లో ఒకరైన్ జో రూట్‌ కూడా బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. ఈ స్టైల్‌ అమలు చేసిన తొలి రోజుల్లో విమర్శలు వచ్చినా తర్వాత మాత్రం భవిష్యత్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌దేనని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ప్రతిసారీ ఒక్కటే ఫార్ములా ఎందుకు వర్క్ అవుట్ అవుతుంది..? ఒక్కటే ఐడియాను గిరిగీసుకోని ఆడతానంటే ఎదురుదెబ్బలు తప్పవు. యాషెస్‌ తొలి టెస్టులోనూ అదే జరిగింది. ఇంగ్లండ్‌ చేసిన ఆ తప్పిదమే ఆ జట్టు కొంపముంచింది.
తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
నిత్యం దూకుడుగానే ఆడతామంటే చెల్లదు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌ను అదే నిండాముంచింది. తొందరపాటు‌ నిర్ణయానికి బెన్ స్టోక్స్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్‌ ఓటమికి పునాదులు పడింది తొలి రోజే. మొదటి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. 78 ఓవర్లు మాత్రమే ఆడి 393 పరుగులు చేసింది. అప్పటికీ సెంచరీ చేసిన జో రూట్ (118 నాటౌట్) క్రీజులోనే ఉన్నా మరో రెండు వికెట్లు చేతిలో ఉన్నా స్టోక్స్ మాత్రం ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. దీన్ని మొదట్లో బోల్డ్‌ అని.. రోల్డ్‌ గోల్డ్‌ అని కొంతమంది ఆవేశ పడి ఆకాశానికి ఎత్తారు. అటు మ్యాచ్‌ చివరి రోజునే ఈ నిర్ణయంపై ఓ క్లారిటీ వస్తుందని విశ్లేషకులు మాత్రం ఇంగ్లండ్‌ కామెంటేటర్ల భజనని కొట్టిపడేశారు. చివరికి ఏం జరిగింది.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 386 పరుగులు చేసింది. ట్రెడిషనల్‌గా టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో అలానే ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఇంగ్లండ్‌ని కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. లోయర్‌ ఆర్డర్‌ సహకారంతో స్టోక్స్ సేనని మట్టికరిపించింది. ఒకవేళ ఇంగ్లండ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మరో 20-30 పరుగులు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో!