IPL: మరుగున పడిపోయిన వజ్రాలను తవ్వి తీసిన ఐపీఎల్! టీమిండియాలో దూసుకొస్తున్న వెటరన్లు..!!

ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయి..! వాళ్లపై పిచ్చి మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్లే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు..! గుట్టుచప్పుడు కాకుండా పాత పోస్టులు కూడా డిలీట్ చేస్తున్నారని టాక్‌..! సైలెంట్‌గా ఆ సీనియర్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారట మీమిర్లు!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2023 | 06:22 PMLast Updated on: May 03, 2023 | 6:22 PM

Url Ipl 2023 Making Wonders And Creating Chances For Veteran Players Rahane Ishant Sharma Mohit Sharma Amit Mishra And Piyush Chawla Lambu May Gets Chance In Wtc Final

వాళ్ల సీన్‌ ఐపోయిందన్నారు..! ఐపీఎల్‌లో వాళ్ల కోసం 50లక్షలు ఖర్చు చేయడం కూడా దండగేనన్నారు..! రిటైర్‌మెంట్ ప్రకటించుకోక ఇంక ఆక్షన్‌లోకి రావడమెందుకంటూ ఎగతాళి చేశారు..! ఇన్నాళ్లూ ఆడింది చాలు..వెళ్లి కామెంటరీ చెప్పుకోండంటూ హేళన చేశారు..! కట్ చేస్తే విమర్శుకుల ఫ్యూజులౌట్..!! సీనియర్లను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో కళ్ల కట్టినట్లు చూపిస్తున్నారు ఈ ఐదుగురు ఆటగాళ్లు.. ట్రోలర్స్ కూడా ప్లేట్‌ మార్చేసి వాళ్లని పొగిడే పనిలో పడిపోయారు.. ఇంతకీ ఎవరా వెటర్లను..? టీమిండియాలో మళ్లీ వాళ్లని చూడబోతున్నామా?

అజింక్యా రహానే:
‘సొగసు చూడ తరమా…’ రహానే బ్యాట్‌ నుంచి బౌండరీలు వరదలై పారుతుంటే ఈ పదాలే గుర్తొస్తాయి.. అంత క్లాస్‌ ప్లేయర్ అతను..! స్ట్రైట్ డ్రైవ్‌ ఆడే బ్యాటర్లు చాలామందే ఉన్నారు.. అయితే సచిన్‌లా ఆడేవాళ్లు ఎవరూ లేరు.. కానీ రహానే స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడితే సచినే గుర్తొస్తాడు.. అతను పుల్‌ చేస్తే పాంటింగ్‌ కళ్లముందు కనిపిస్తాడు..! అలాంటి రహానే టీమిండియాలో స్థానం కోల్పోయి 15నెలలు దాటింది.. అందరూ విఫలమైన చోటే రహానే కూడా ఫెయిల్ అయ్యాడు.. కానీ సెలక్టర్లు అతడినే బలిపశువు చేశారు.. టీమ్‌లో నుంచి పక్కన పెట్టేశారు..! ఇక రహానే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం అసాధ్యమేనని అటు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు..కొంతమంది బాధ పడ్డారు కూడా..అయితే ఫామ్‌ ఇజ్‌ టెంపరరీ.. క్లాస్‌ ఇజ్ పర్మనెంట్ అనే విషయాన్ని అక్షరాల నిజం చేసి చూపించాడు రహానే..

గతేడాది(2022-23) రంజీ సీజన్‌లో రహానే అదరగొట్టాడు.. ముంబై జట్టు కెప్టెన్‌గా రహానే తన క్లాస్‌ చూపించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 57.63 యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరుగులేని విజయాలు అందిస్తున్నాడు. క్లాసిక్‌ బ్యాటరైన రహానే మాస్‌ షాట్ల కూడా జత చేసి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు.. అసలు మనం చూస్తుంది రహానేనానన్న అనుమానం వచ్చేలా సిక్సులు బాదుతున్నాడు.. సంప్రాదాయ క్రికెట్ షాట్లు ఎక్కువగా ఆడే రహానే అన్‌అర్థొడాక్స్‌ షాట్లతో అలరిస్తున్నాడు.. రహానే ఇలా ఆడుతాడని ఎవరూ ఊహించలేదు.. రహానే తిరిగి సూపర్ టచ్‌లోకి రావడంతో టీమిండియా ఈ వెటరన్ ఆటగాడికి డోర్స్ ఓపెన్ చేసింది..వచ్చే నెల 7నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC)ఫైనల్‌లో ఆడేందుకు ఈ ముంబై సీనియర్‌ ఆటగాడికి అవకాశమిచ్చింది.. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉండడం.. ప్రస్తుత ఫామ్‌.. మిడిలార్డర్‌ వీక్‌నెస్‌..శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడడం రహానేకు ప్లస్‌గా మారింది..

ఇషాంత్ శర్మ:
ఈ సీజన్‌లో కనీసం 10ఓవర్లు బౌలింగ్‌ చేసి.. ఒక్కటంటే ఒక్క సిక్సు కూడా సమర్పించుకొని బౌలర్‌ ఎవరో తెలుసా? నరైన్ కాదు..ఇంకెవరో కాదు.. మన లంబూ ఇషాంత్‌ శర్మ..! ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 84 బంతులు వేసిన ఇషాంత్ కేవలం 91పరుగులే ఇచ్చాడు.. అంటే ఎకనామీ 6.50. ఈ ఎకానమీతో ఇషాంత్ బౌలింగ్‌ వేస్తాడని ఎవరూ ఊహించలేదు.. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ అద్బుతమే చేశాడు.. ఆఖరి ఓవర్‌లో 12పరుగులు చేయాల్సిన హార్దిక్‌ పాండ్యా టీమ్‌ను తన తెలివితేటలతో బోల్తా కొట్టించాడు.. అప్పటికే క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా మూడు సిక్స్‌లు కొట్టి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ పాండ్యా ఉన్నాడు.. ఇక గుజరాత్ విజయం ఈజీనే అనుకున్నారంతా.. అయితే లంబూ అనుభవంముందు తెవాటియా తేలిపోయాడు.. వికెట్ సమర్పించుకోని పెవిలియన్ చేరాడు.. ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు లంబూ. దీంతో గుజరాత్ టీమ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్‌ బౌలింగ్‌తో ఢిల్లీ శిబిరం ఆనందంలో మునగిపోయింది.

రహానే తరహాలోనే ఇషాంత్‌కు టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. WTC ఫైనల్ కోసం ఇప్పటికే 15 నెంబర్‌ స్క్వాడ్‌ను ప్రకటించింది బీసీసీఐ. అయితే టీమ్‌లో భాగంగా ఉన్న జయదేవ్ ఉనాద్కాట్ గాయపడ్డాడు.. అతని స్థానంలో ఇషాంత్‌ను తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.. ఎందుకంటే ఇషాంత్‌ అనుభవం టీమిండియాకు ప్లస్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! రిక్కి పాంటింగ్‌ లాంటి లెజెండరీ బ్యాటర్లకే తన పదునైన బంతులతో నిద్రలేని రాత్రులు మిగిల్చిన లంబూ మరోసారి టీమిండియాకు ఆడాలని.. WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ స్టాండ్‌ను పేకమేడలా కూల్చాలని ఫ్యాన్స్‌ కొరుకుంటున్నారు. మరి చూడాలి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!

పియూష్ చావ్లా:
34 ఏళ్ల పియూష్‌ చావ్లా టీమిండియాకు ఆడి ఏళ్లు దాటిపోయింది.. చివరిసారిగా 2012లో ఇంగ్లండ్‌పై ఆడాడు చావ్లా.. ఐపీఎల్‌లో పంజాబ్‌ టీమ్‌ను చాలా సార్లు గెలిపించిన చావ్లా.. ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు ప్రధాన బౌలర్‌గా మారాడు. రోహిత్‌ టీమ్‌ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్ ఘోరంగా ఉండడం.. బుమ్రా కూడా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కావడం.. అటు జోఫ్రా అర్చర్ ఎప్పుడు ఫిట్‌గా బరిలోకి దిగుతాడో తెలియక.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ముంబై టీమ్‌కు పియూష్‌ కీలక సమయంలో ప్రధాన బ్యాటర్ల వికెట్లు తీసి పుంజుకునేలా చేస్తున్నాడు. అటు ఈ సీజన్‌లో చావ్లా ఎకానమీ కూడా 7.29గా ఉంది. 8 మ్యాచ్‌ల్లో 13వికెట్లు తీశాడు చావ్లా.

మోహిత్‌ శర్మ:
ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌లో వికెట్ టేకింగ్‌ బౌలర్‌గా ఉన్న మోహిత్ శర్మ.. ఆ తర్వాత తక్కువ కాలంలోనే టీమ్‌లోకి రావడం.. వెంటనే కనుమరుగైపోవడం చకాచకా జరిగిపోయాయి.. ఇక మోహిత్ సీన్‌ ఐపోయిందని అంతా భావించారు.. అయితే ఈ సీజన్‌లో మోహిత్ శర్మ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపిస్తున్నాడు..గుజరాత్‌ టైటాన్స్‌ విజయాల్లో కీలక పాత్ర పొషిస్తున్నాడు మోహిత్. లక్నోపై మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్‌లో 11పరుగులు చేయాల్సి ఉండగా.. కెప్టెన్ పాండ్యా మోహిత్‌ను బాల్‌ ఇవ్వగా.. అతను కేవలం నాలుగు పరుగులే ఇచ్చి తన జట్టుకు గ్రాండ్‌ విక్టరీనందించాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌ శర్మ.. 8వికెట్లు పడగొట్టాడు.. ఎకానమీ కూడా ఏడులోపే ఉంది.

అమిత్‌ మిశ్రా:
40ఏళ్ల అమిత్ మిశ్రా.. ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా బౌలింగ్ వేస్తున్నాడు.. లక్నో తరుఫున ఆరు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లే పడగొట్టినా.. ఎకానమీ మాత్రం 7.27గానే ఉంది. రన్స్‌ లీక్‌ చేసే ఏజ్‌లో పరుగుల ప్రవాహాన్ని మిశ్రా కంట్రోల్ చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈ ఐదుగురు సీనియర్లు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా క్లిక్‌ అయ్యారు