ఐదేసిన వరుణ్ చక్రవర్తి భారత స్పిన్నర్ నయా హిస్టరీ
అవకాశం ఇవ్వడమే చాలు బంతితో చెలరేగిపోతున్నాడు...తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు...తన ప్రదర్శనతో తుది జట్టు కూర్పును మరింత క్లిష్టంగా మార్చేశాడు..

అవకాశం ఇవ్వడమే చాలు బంతితో చెలరేగిపోతున్నాడు…తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు…తన ప్రదర్శనతో తుది జట్టు కూర్పును మరింత క్లిష్టంగా మార్చేశాడు…అతను ఎవరో కాదు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి…ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన వరుణ్ కివీస్ పై అయిదు వికెట్లతో అదరగొట్టాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వరుణ్ చక్రవర్తికి ఇది రెండో వన్డే మ్యాచ్ మాత్రమే.
ఇంతకముందు ఈ ఘనత టీమ్ఇండియా మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. బిన్నీ తన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్ తో మ్యాచ్ ప్రదర్శనతో వరుణ్ మరో ఘనతను సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా.. కివీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనలను చూస్తే తొలి రెండు స్థానాల్లో రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ఉండగా… మహ్మద్ షమీ మూడో స్థానంలో ఉన్నాడు. షమీ ఇదే టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై అయిదు వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్థానాల్లో సచిన్ , జహీర్ ఖాన్ నిలిచారు.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తన ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతిని వేసేటప్పుడు చాలా టెన్షన్ పడినట్లు తెలిపాడు. అయితే.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లు తనకు మద్దతు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ పై విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. మార్చి4న జరగనున్న సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరో సెమీస్ లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడతాయి.