అరంగేట్రమే ఓ రికార్డ్ వన్డేల్లోకి వరుణ్ చక్రవర్తి
గత కొంతకాలంగా భారత క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ళలో వరుణ్ చక్రవర్తి ఒకడు... జాతీయ జట్టు తరపున టీ ట్వంటీల్లో అదరగొడుతున్న ఈ స్పిన్నర్ ఇప్పుడు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు

గత కొంతకాలంగా భారత క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ళలో వరుణ్ చక్రవర్తి ఒకడు… జాతీయ జట్టు తరపున టీ ట్వంటీల్లో అదరగొడుతున్న ఈ స్పిన్నర్ ఇప్పుడు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ఫరూఖ్ ఇంజనీర్ 36 ఏళ్ళ 138 రోజుల వయస్సులో ఇంగ్లాండ్ పైనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వరుణ్ 33 ఏళ్ల 164 రోజుల వయసులో అతడు ఎంట్రీ ఇచ్చాడు.
1974లో టీమిండియా లీడ్స్ వేదికగా తొలి సారి ఇంగ్లాండ్ పై వన్డే మ్యాచ్ ఆడింది. అంటే అప్పటి నుంచి.. గత 51ఏళ్లలో లేటు వయసులో ఇంగ్లాండ్ పై భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేసిన తొలి ఆటగాడు వరుణ్ చక్రవర్తినే. మొత్తంగా లేటు వయసులో ఇంగ్లాండ్ పై భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. ఫరూఖ్ ఇంజనీర్, వరుణ్ చక్రవర్తి, అజిత్ వాడేకర్, దిలీప్ దోషి, సయద్ అబిద్ అలీ ఈ జాబితాలో నిలిచారు. కాగా ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 10 ఓవర్ల తన స్పెల్ లో 54 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే వరుణ్ చక్రవర్తి గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రదర్శనలతోనే టీ ట్వంటీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా చోటు దక్కించుకుంటున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ బ్యాటర్లను టీ ట్వంటీ సిరీస్ లో బాగా ఇబ్బంది పెట్టడంలో వరుణ్ సక్సెస్ అయ్యాడు. ఈ కారణంగానే ముందు ప్రకటించిన వన్డే జట్టులో అతను లేకున్నా మళ్ళీ తీసుకున్నారు.
ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్ పేసర్ బుమ్రా ఫిట్ నెస్ సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్స్ లో హర్షిత్ రాణా ఉండడంతో బుమ్రా రీప్లేస్ మెంట్ గా వరుణ్ ను ఎంపిక చేసే అవకాశముంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి. అక్కడ పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరుణ్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.