Leg Day: ‘లెగ్ డే’ విషయంలో ఎనిమిదేళ్లు విరాట్ ఫిట్నెస్ మంత్ర
విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఉండటానికి అతడి ఫిట్‌నెస్ స్థాయే కారణం. విపరీతంగా జిమ్‌లో కష్టపడుతుంటాడు. అదే తన విజయ రహస్యమని చాలాసార్లు చెప్పాడు.
గత ఎనిమిదేళ్ల నుంచి ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదంటే ఫిట్‌నెస్ స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాజాగా విండీస్ పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం అశ్రద్ధ వహించడం లేదు. ఈ సందర్భంగా తాను జిమ్‌లో కష్టపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ప్రతి రోజు ‘లెగ్‌డే’. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కోచ్‌తో కలిసి కాళ్లను బలోపేతం చేసే వ్యాయామాలు చేశాడు. దీంతో నెటిజన్లు అసలు ‘లెగ్ డే’ అంటే ఏంటో సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు.
క్రీడాకారులకు కాళ్లు చాలా బలంగా ఉండాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం, బౌలింగ్ కోసం రనప్ చేయడం చేస్తుంటారు. అలాంటప్పుడు తమ కాళ్లు చురుగ్గా స్పందించాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే. వీటిని కోచ్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. బరువులను మోయడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల పిక్కలు బలంగా మారతాయి. గాయాల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుంది. బాడీ సైన్స్ అకాడమీ సహవ్యవస్థాపకుడు వరుణ్ రత్తన్ ‘లెగ్ ఎక్స్‌ర్‌సైజ్‌ల’ గురించి వివరించారు.