20 కోట్లిస్తే ప్రతీ మ్యాచ్ లో సెంచరీ కొట్టాలా ? వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్
ఐపీఎల్ ఎప్పుడు జరిగినా వేలంలో భారీ ధరకు అమ్ముడైన ఆటగాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ధరకు తగ్గట్టు వారి ఆట ఉందా లేదా అన్న చర్చ జరగడం కామన్.. భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్లు విఫలమవడం చాలా సార్లే చూశాం..

ఐపీఎల్ ఎప్పుడు జరిగినా వేలంలో భారీ ధరకు అమ్ముడైన ఆటగాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ధరకు తగ్గట్టు వారి ఆట ఉందా లేదా అన్న చర్చ జరగడం కామన్.. భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్లు విఫలమవడం చాలా సార్లే చూశాం.. అలా ఫెయిలైన ప్లేయర్స్ పై సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతాయి. గత ఏడాది మెగావేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ ను 23.75 కోట్లకు దక్కించుకుంది. వైస్ కెప్టెన్ గానూ బాధ్యతలు అప్పగించింది. కానీ తొలి మూడు మ్యాచ్ లలో అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఫలితంగా అతనికి 20 లక్షలు కూడా ఎక్కువన్న కామెంట్స్ వినిపించాయి. అయితే సన్ రైజర్స్ తో మ్యాచ్ లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తనదైన మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.సునామీ ఇన్నింగ్స్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ 150 పరుగులైనా చేస్తుందా అనుకున్న సమయం నుంచి ఏకంగా డబుల్ సెంచరీ స్కోర్ చేయడం చేరుకోవడంలో వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. మొదట్లో దూకుడుగా ఆడలేదు. మొదటి 10 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఆ తర్వాత తన విశ్వరూపం మొదలుపెట్టాడు. ఫోర్లు సిక్సర్లు బాదుతూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 29 బంతుల్లో 60 పరుగుల చేశాడు. మహమ్మద్ షమీ వేసిన 16వ ఓవర్లో అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోతూ SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ను ఉతికారేశాడు. 2 భారీ సిక్సర్లతో పాటు మరో 2 ఫోర్లు బాదాడు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్ ఓవరాల్ గా 206.89 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెంకటేశ్ అయ్యర్ తన ప్రైస్ ట్యాగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఐపీఎల్ మొదలైందంటే.. ఓ ఆటగాడు అమ్ముడైన ధరతో సంబంధం ఉండదన్నాడు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదని చెప్పుకొచ్చాడు. అయితే ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని తనకు తెలుసన్నాడు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యమన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తాను సన్ రైజర్స్ పై బ్యాటింగ్ చేశానంటూ వ్యాఖ్యానించాడు. అయితే అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదన్నాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా లేదా అన్నదే ముఖ్యమంటూ చెప్పుకొచ్చాడు. ప్రైస్ ట్యాగ్ తో ఒత్తిడి ఉంటుందన్న విషయం తనకు తెలుసనీ, ఈ విషయంలో తాను అబద్ధం ఆడాల్సిన పనిలేదన్నాడు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదన్న అయ్యర్ జట్టుకు తాను ఉపయోగపడుతున్నానా లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుందన్నాడు. 20 లక్షలైనా, 20 కోట్లయినా ప్రతీ ఆటగాడు జట్టు కోసమే ఆడతాడంటూ వ్యాఖ్యానించాడు. వెంకటేశ్ అయ్యర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.