ఫండ్ రైజింగ్ లోనూ కోహ్లీ హవా రూ. 40 లక్షలు పలికిన జెర్సీ
క్రికెట్ ఫర్ ఎ కాజ్ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమ వేలంలో కోహ్లీ జెర్సీ, గ్లోవ్స్ అత్యధిక ధర పలికాయి.
ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు… గ్రౌండ్ లో రికార్డులతో హోరెత్తిస్తూ కింగ్ కోహ్లీగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరాట్ బ్రాండ్ వాల్యూలోనూ తనదైన ముద్ర వేశాడు. అటు సోషల్ మీడియా ఫాలోయింగ్ లోనూ కోహ్లీ సరికొత్త రికార్డులు సృష్టించాడు. తాజాగా ఓ ఛారిటీ కార్యక్రమం కోసం ఫండ్ రైజింగ్ నిర్వహించగా అక్కడ కూడా కోహ్లీ హవానే కనిపించింది. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య, బాలీవుడ్ నటి అతియా శెట్టి కలిసి వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం క్రికెట్ ఫర్ ఎ కాజ్ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు క్రికెటర్ల వస్తువులను సేకరించి.. వాటిని వేలం వేశారు.
ఈ వేలంలో కోహ్లీ జెర్సీ, గ్లోవ్స్ అత్యధిక ధర పలికాయి. కోహ్లీ జెర్సీ 40 లక్షలకు, గ్లోవ్స్ 28 లక్షలకు అమ్ముడయ్యాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ 24 లక్షలు, ధోనీ బ్యాట్ 13 లక్షలు, ద్రవిడ్ బ్యాట్ 11 లక్షలు పలికాయి. ఈ వేలం ద్వారా రాహుల్-అతియా దంపతులు మొత్తం 1.93 కోట్లు సేకరించారు. ఈ మొత్తాన్ని విప్లా ఫౌండేషన్‌కు అందిస్తారు. ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం.. టీమిండియా క్రికెటర్లు కోహ్లీ, రోహత్, అశ్విన్, జడేజా, బుమ్రాతో పాటు మరికొంత మంది తన వస్తువులను ఉచితంగా డొనేట్ చేశారు. పలువురు విదేశీ క్రికెటర్లు సైతం ఈ కార్యక్రమానికి మద్ధతుగా నిలిచారు.