Virat Kohli: 15 ఏళ్ళ ప్రయాణం.. ఎవ్వరూ టచ్ చేయలేని శిఖరం..

కింగ్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గ‌డిచాయి. 2008, ఆగస్ట్ 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 07:53 PMLast Updated on: Aug 18, 2023 | 7:53 PM

Virat Kohli Uses Two Words To Sum Up 15 Years In International Cricket

Virat Kohli: సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. అంటే 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లోకి 19 ఏళ్ల భారత యువ ఆటగాడు అడుగుపెట్టాడు. ఆ రోజు ఎవరూ ఊహించలేదు. ఆ యువకెరటం ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువ కిషోరం క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోటీ పడతాడని. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విమర్శలపాలైన ఆ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ క్రికెట్‌లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే ఆదర్శం.

అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, రన్‌ మిషన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి. కింగ్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గ‌డిచాయి. 2008, ఆగస్ట్ 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన తొలి మ్యాచ్‌లో కోహ్లి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడు ఓపెనర్‌గా పనికిరాడని కామెంట్లు చేశారు. కానీ కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోలేదు. అదే సిరీస్‌లో నాలుగో వన్డేలో తొలి హాఫ్‌సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు. ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 159 పరుగులతో పర్వాలేదనిపించాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌తో ‘ఫ్యాబ్ ఫోర్’లో కోహ్లి భాగమయ్యాడు.

70 సెంచరీలు అలవోకగా సాధించిన కోహ్లి.. తన 71వ శతకాన్ని అందుకోవడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ సమయంలో విరాట్‌ ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా అతడి పని అయిపోయిందని, క్రికెట్‌ నుంచి తప్పుకుంటే బాగుంటుందని చాలా మంది హేళన చేశారు. కానీ కోహ్లి దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియాకప్‌ టీ20లో ఆఫ్గానిస్తాన్‌పై కోహ్లి సంచలన సెంచరీతో చెలరేగాడు. ఆ సెంచరీతో తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఆ మ్యాచ్‌ తర్వాత కోహ్లిని అపడం ఎవరూ తరం కాలేదు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక తన 15 ఏళ్ల కెరీర్‌లో కోహ్లి ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.