కింగ్ కోహ్లీ రికార్డుల వేట ,వార్నర్ ను దాటేసిన విరాట్

ఐపీఎల్ 18వ సీజన్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగుతోంది. నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న కోహ్లీ తాజాగా పంజాబ్ కింగ్స్ పై అదరగొట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 12:30 PMLast Updated on: Apr 21, 2025 | 12:30 PM

Virat Surpasses Warner In King Kohlis Record Chase

ఐపీఎల్ 18వ సీజన్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగుతోంది. నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న కోహ్లీ తాజాగా పంజాబ్ కింగ్స్ పై అదరగొట్టాడు. 54 బంతుల్లో 73 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 67 సార్లు.. ఫిఫ్టీ ఆ పైచిలుకు స్కోరు సాధించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు. డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో 66 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజాగా ఛేజ్ మాస్టర్ ఈ రికార్డును బీట్ చేశాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ 53, రోహిత్ శర్మ 45, కేఎల్ రాహుల్ 43 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఓవరాల్ గా టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలోనూ విరాట్ టాప్-2లో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 101 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లలో 64కు పైగా సగటుతో 322 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ మెరుపులతో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ రివేంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్.. 157 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ.. 18.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా… పంజాబ్ కింగ్స్ నాలుగో ప్లేసుకు పడిపోయింది.