చెపాక్ లో మామూలుగా ఉండదు, ఆర్సీబీకి వాట్సన్ వార్నింగ్

ఐపీఎల్ 18వ సీజన్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 08:45 PMLast Updated on: Mar 27, 2025 | 8:45 PM

Watsons Warning To Rcb

ఐపీఎల్ 18వ సీజన్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ కు లోటు లేదు… మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్ళకు లోటు లేదు.. ఒకవైపు ధోనీ, మరోవైపు కోహ్లీ… అందుకే ఈ మ్యాచ్ కు ఉండే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ పోరు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ ను ఇరు జట్లు విజయంతోనే ప్రారంభించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లోనే ఓడిస్తే… సీఎస్కే ముంబై ఇండియన్స్ పై గెలిచింది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నైని దాని సొంత గడ్డపై ఓడించడం ఆర్సీబీకి అతిపెద్ద సవాల్ అని మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. చెన్నై జట్టుతో జాగ్రత్తగా ఉండాలని.. ఒక్క పొరపాటు చేసినా ఓటమి తప్పదని వాట్సన్ బెంగళూరు టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు. వాట్సన్ కు గతంలో చెన్నై, ఆర్సీబీ రెండు జట్లలో ఆడిన అనుభవం ఉండడంతో ఈ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీకి పెనుసవాల్ తప్పదని.. సీఎస్కే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఉన్నారని వాట్సన్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టుకు ధీటుగా సమాధానం ఇవ్వాలంటే బెంగళూరు కూడా సరైన కూర్పుతో బరిలోకి దిగాలన్నారు. ముంబైపై సీఎస్కే తరఫున ఆడిన ముగ్గురు అద్భుతంగా రాణించారన్నాడు. ఆ జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ చెపాక్ స్టేడియంలో అసాధారణంగా రాణిస్తారని గుర్తు చేశాడు. ఈ పిచ్ పై వారిని ఎదుర్కోవడం అంత తేలికేం కాదన్నాడు. సీఎస్కే తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే నూర్ మహ్మద్ అసాధారణ ప్రదర్శన ఇచ్చాడని.. ఇది జట్టు కాన్ఫిడెన్స్ పెంచిందన్నాడు. నూర్ అహ్మద్ పై ఎంతో నమ్మకముంచిన సీఎస్కే ప్లానింగ్ ను వాట్సన్ మెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇరు జట్ల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా గట్టి వారే నడుస్తోంది. ఆర్‌సీబీని ఓడించి గత సీజన్‌‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్‌కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు విజయంతో సీఎస్‌కే ట్రోల్స్‌కు సమాధానం ఇవ్వాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తోంది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన విజయంతో ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఆ విజయానంతరం టైటిల్ గెలిచిన రీతిలో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకోగా.. చెన్నై ఫ్యాన్స్ తీవ్ర బాధకు గురయ్యారు. ఇరు జట్ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. అంబటి రాయుడి వంటి మాజీ క్రికెటర్లు కూడా తమ వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌ను మరింత రెచ్చగొట్టారు.