ఈ చెన్నైకి ఏమైంది ? డై హార్డ్ ఫ్యాన్స్ ఆవేదన
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ఒకటి... సీజన్ ఆరంభం నుంచీ మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా గుర్తింపు... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు..

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ఒకటి… సీజన్ ఆరంభం నుంచీ మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా గుర్తింపు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు… వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్సీ రికార్డున్న సారథే మొన్నటి వరకూ నడిపించాడు.. స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేదు.. మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పే ప్లేయర్లు సైతం ఉన్నారు… కానీ ఈ సీజన్ లో మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఆ జట్టు మరేదో కాదు చెన్నై సూపర్ కింగ్స్… భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే ఇప్పటి వరకూ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది… తర్వాత వరుసగా నాలుగింటిలోనూ పరాజయం పాలైంది. దీంతో అసలు చెన్నై జట్టుకు ఏమైందంటూ అభిమానులు చర్చ మొదలుపెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములు డై హార్ట్ ఫ్యాన్స్‌కు మింగుడు పడకుండా చేస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టు ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలురా నాయనా అన్నట్టు మారింది
చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌ను చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై ఆడింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించి విజయంతో సీజన్‌ను ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌లలోనూ వరుసగా ఓటములను మూటగట్టుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై ఎన్నో ఏళ్ల తర్వాత హోం గ్రౌండ్ చెపాక్‌లో ఓడిపోయింది. ఆర్సీబీపై 2008లో చెపాక్‌లో ఓడిన సీఎస్కే మళ్లీ 2025లో అంటే 17 ఏళ్ల తర్వాత ఓటమిపాలయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 సంవత్సరాల తర్వాత చెపాక్ స్టేడియంలో ఓడిపోయింది. ఈ ఓటములను చూస్తున్న సగటు సీఎస్కే అభిమాని తమ జట్టు పతనాన్ని చూడలేకపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లు ఛేజింగే చేసింది. మొదటి మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై.. మిగతా మ్యాచ్‌లన్నీ ఓడిపోయింది. ఆర్సీబీపై దారుణంగా యాభై పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరు, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 25 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. పంజాబ్ కింగ్స్‌పై 200కి పైగా పరుగులు చేసినప్పటికీ 18 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
ఈ ఏడాది అన్ని జట్ల కంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం చాలా వీక్‌గా ఉంది. ఉన్న కొంతమంది కూడా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రచిన్ రవీంద్ర, శివమ్ దుబే, దేవాన్ కాన్వే లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ భారీ స్కోర్స్ చేయడంలో విఫలమవుతున్నారు. ప్లేయింగ్ 11లో ఉన్నవాళ్లంతా టీ20లకు తగ్గట్టు కాకుండా వన్డేల్లా ఇన్నింగ్స్ ఆడుతుండటంతో మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక ఫీల్డింగ్‌లో కూడా క్యాచ్‌లు మిస్ చేయడంతో భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తోంది. చెన్నై పేలవ ఫీల్డింగ్ కారణంగానే ప్రత్యర్థి జట్లు భారీస్కోర్లను చేయడం దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ జరుగుతోంది. ఒకవిధంగా బ్యాటింగ్ తో పాటు చెన్నై చెత్త ఫీల్డింగ్ కూడా ఆ జట్టు వరుస ఓటములకు కారణం. ఇక బ్యాటింగ్ లో మహేంద్రసింగ్ ధోనీ ఆట కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతీ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ చేసే ప్లేస్ మారుతోంది.. మోకాలి గాయానికి సర్జరీ తర్వాత మునుపటిలో ధోనీ బ్యాటింగ్ కనిపించడం లేదు. ఈ విషయాన్ని కోచ్ ఫ్లెమింగ్ కూడా ఓపెన్ గానే చెప్పేశాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ బ్రాండ్ వాల్యూ కోసమే ధోనీని ఆడిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బౌలింగ్ లో కూడా ఆ జట్టు బౌలర్లు స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నారు. నూర్ అహ్మద్ తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చాలా ఏళ్ళ తర్వాత చెన్నై జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కూడా ఫెయిలవుతున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై రానున్న మ్యాచ్ లోనైనా తమ ఆటతీరును ఇంప్రూవ్ చేసుకుంటుందో లేదో చూడాలి.