Broad: బ్రాడ్ ఒక బ్రాండ్
లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ సిరీస్ 2-2తో ముగిసింది. అలాగే ఈ గొప్ప విజయంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఈ క్రమంలోనే అతను నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఆసీస్ ఆటగాళ్లు వచ్చి అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ అందజేశారు. అంటే బ్రాడ్ మైదానంలోకి వస్తుంటే.. అటూ ఇటూ నిలబడి చప్పట్లు కొడుతూ గౌరవించారు. ఈ సమయంలో బ్రాడ్, ఆండర్సన్ ఇద్దరూ మైదానంలోకి వచ్చారు. వీళ్లిద్దరూ నాలుగో రోజున కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి, ఓవర్ నైట్ స్కోరుకు ఆరు పరుగులు జత చేశారు. ఈ ఆరు పరుగులు బ్రాడ్ చేసినవే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ ఎదుర్కొన్న చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కాసేపటికే స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో ఆండర్సన్ పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఇలా సిక్సర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను చాలా తక్కువ మంది ప్లేయర్లు మాత్రమే ముగించడం గమనార్హం. ఇక ఇలా కెరీర్ ముగించిన క్రమంలో యువరాజ్ సింగ్ తన బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన ఘటనను కూడా బ్రాడ్ గుర్తు చేసుకున్నాడు. దీని తర్వాతనే తన మనస్తత్వం పూర్తిగా మారిందని, ఆటలో చాలా మెరుగయ్యానని చెప్పాడు. అయినా సరే అలా ఆరు సిక్సర్లు బాదించుకోకుండా ఉంటేనే బాగుండేదని నవ్వేశాడు. ఈ క్రమంలో బ్రాడ్ రిటైర్‌మెంట్ గురించి యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. బ్రాడ్ ఒక లెజెండ్ అని, రెడ్ బాల్ క్రికెట్‌లో ప్రత్యర్థులను భయపెట్టే అతికొద్ది మంది బౌలర్లలో ఒకడని మెచ్చుకున్నాడు.
ఇంత గొప్ప అంతర్జాతీయ కెరీర్ సాగించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. రిటైర్‌మెంట్ తర్వాత కామెంటేటర్‌గా బ్రాడ్ కొత్త అవతారం ఎత్తుతాడని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్‌ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం.
కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధికంగా 604 వికెట్లు తీసిన బ్రాడ్, బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో ఒక సెంచరీ , 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రాడ్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు అభినందనలు తెలిపారు.