ఐపీఎల్ మెగావేలం RCB కొత్త కెప్టెన్ గా అతడేనా ?
ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా నాలుగు నెలల సమయముంది.
ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా నాలుగు నెలల సమయముంది. ఈ సారి పలువురు స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలోకి రానుండడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఏ ప్లేయర్ ను ఎవరు కొంటారు…కొత్త కెప్టెన్లుగా ఎవరుంటారు అన్న వాటిపై చర్చ మొదలైంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆర్సీబీ మెగా వేలానికి ముందే పలువురు కీలక ఆటగాళ్ళను రిలీజ్ చేయనుంది. ఈ జాబితాలో కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో బెంగళూరు టీమ్ వచ్చే సీజన్ కోసం కొత్త సారథిని వెతుక్కునే పనిలో పడింది. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెెఎల్ రాహుల్ కోసం బెంగళూరు ప్రయత్నించే అవకాశమున్నట్టు సమాచారం. రాహుల్ ను తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి గతంలో రాహుల్ బెంగళూరు టీమ్ కు ఆడాడు. దీనికి తోడు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా సంజీవ్ గోయెంకాతో కూడా రాహుల్ సమావేశమైనప్పటకీ ఏం చర్చించాడనేది తెలియలేదు. అయితే రాహుల్ వేలంలోకి వస్తే బెంగళూరు ఫ్రాంచైజీ అతన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ గా జట్టుకు అడ్వాంటేజ్ అవుతాడని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. గత మూడు సీజన్లుగా లక్నోను కెఎల్ రాహుల్ సమర్థవంతంగా లీడ్ చేస్తున్నాడు. 2022, 2023 సీజన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చిన రాహుల్ ను లక్నో ఈ సారి రిటైన్ చేసుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది.