జాక్ పాట్ కొట్టేదెవరో ? మెగా వేలానికి అంతా రెడీ

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలానికి అంతా సిద్ధమైంది. రెండోసారి విదేశాల్లో జరగనున్న వేలంలో కోట్లాదిరూపాయల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2024 | 11:45 AMLast Updated on: Nov 24, 2024 | 11:45 AM

Who Will Hit The Jackpot Everything Is Ready For The Mega Auction

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలానికి అంతా సిద్ధమైంది. రెండోసారి విదేశాల్లో జరగనున్న వేలంలో కోట్లాదిరూపాయల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. సౌదీ అరేబియన్ సిటీ జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు మెగా ఆక్షన్ జరగబోతోంది. గతంతో పోలిస్తే ఈ సారి మెగావేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి కారణం. పలు జట్ల కెప్టెన్లు సైతం ఈ సారి వేలం బరిలో నిలిచారు. మొత్తం 577 మంది ప్లేయర్స్ కోసం 10 ఫ్రాంచైజీలు గరిష్టంగా 677 కోట్ల వరకూ వెచ్చించే అవకాశముంది. మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పది ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఈ 574 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, అరంగేట్ర ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ గరిష్టంగా ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. కనిష్టంగా పంజాబ్ కింగ్స్ ఇద్దర్ని మాత్రమే అట్టిపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గుర్ని రిటైన్ చేసుకోగా.. ముంబై, చెన్నై, లక్నో, గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. రిషభ్ పంత్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్.. నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకుంది.

ప్రతీ జట్టు పర్స్ వాల్యూను బీసీసీఐ 120 కోట్లకు పెంచంది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ దగ్గర 110.5 కోట్ల పర్స్ మనీ ఉంది. ఇద్దర్ని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు రిటెన్షన్ కోసం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు భారీ సొమ్మును దగ్గర ఉంచుకుంది. కనిష్టంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద 41 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద 45 కోట్ల పర్స్ మనీ మిగిలి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్‌ బ్యాలెన్స్‌ ఉంచుకుంది. పంజాబ్‌, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్‌ బ్యాలెన్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్‌ ఉంది.

పంజాబ్‌, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత లక్నో, గుజరాత్‌ 69 కోట్ల చొప్పున…, చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 55 కోట్లు, కోల్ కత్తా వద్ద 51 కోట్ల బ్యాలెన్స్‌ ఉంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్‌ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్‌ ఆటగాళ్ల కోసం​ వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత రికార్డులు పంత్ బిడ్డింగ్ తో బ్రేక్ అవుతాయని విశ్లేషిస్తున్నారు. అలాగే కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్, లక్నోకు సారథిగా ఉన్న కెఎల్ రాహుల్ కోసం ఫ్రాంచైజీ తీవ్రంగానే పోటీ పడే అవకాశాలున్నాయి. మరోవైపు దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న పలువురు యువ ఆటగాళ్ళు జాక్ పాట్ కొడతారని చెప్పొచ్చు. అదే సమయంలో విదేశీ స్టార్ ప్లేయర్స్ పైనా ఫ్రాంచైజీలు ఎప్పటిలానే కోట్ల వర్షం కురిపించే ఛాన్సుంది.

రెండు మార్కీ సెట్లతో వేలం ప్రారంభం కానుంది. ఒక్కో జాబితాలో ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. అందులో M1 జాబితాలో పంత్, శ్రేయస్ అయ్యర్, జాస్ బట్లర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడా, మిచెల్ స్టార్క్‌లు ఉన్నారు. M2లో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. దీని తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో ఉన్నవారు వేలంలోకి వస్తారు. ఆ తర్వాత ఇదే కేటగిరీలో అన్ క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. ఇదిలా ఉంటే ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయని చెప్పొచ్చు. దీని ప్రకారం మెగావేలంలో ఆటగాడిని తీసుకుంటే మూడేళ్ళ కాంట్రాక్ట్ ఉండనున్న నేపథ్యంలో వయసు, ఫిట్ నెస్, ప్రస్తుత ఫామ్ కీలకం కానున్నాయి.