Team India : ఇషాన్ ఎందుకిలా చేస్తున్నావ్.. కోచ్ ఆదేశాలు పట్టించుకోని యువక్రికెటర్
టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం.. ఎప్పటికప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాల్సిందే.. కేవలం ఆటే కాదు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో యువక్రికెటర్ ఇషాన్ కిషన్ భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియా (Team India)లో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం.. ఎప్పటికప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాల్సిందే.. కేవలం ఆటే కాదు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో యువక్రికెటర్ (Young Cricketer) ఇషాన్ కిషన్ (Ishan Kishan) భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కోచ్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడకుండా సెలవు తీసుకున్న ఇషాన్ కిషన్ ఆ తర్వాత దుబాయ్‍కు వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. దీంతో బీసీసీఐ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల అఫ్గానిస్థాన్(Afghanistan)తో మూడు టీ20(T20)ల సిరీస్ నుంచి కూడా అతనే బ్రేక్ కోరాడు. దీంతో మళ్లీ భారత జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఫిట్‍నెస్ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్‍ను ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‍కు తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావించింది. అయితే, ద్రవిడ్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‍లు ఆడలేదు. తాజాగా మూడో మ్యాచ్‍లోనూ ఇషాన్ కిషన్ బరిలోకి దిగలేదు. దీంతో ద్రవిడ్ ఆదేశాలను మరోసారి అతడు ధిక్కరించినట్టయింది. ఇప్పటికే ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్‍ను తీసుకుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ రంజీలు ఆడకపోతుండడంతో అతడు భారత జట్టులోకి వచ్చే అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి.
ఒకవేళ బీసీసీఐకు మళ్లీ అప్‍డేట్ ఇవ్వకుండానే రంజీ మ్యాచ్‍లకు ఇషాన్ కిషన్ డుమ్మా కొట్టినట్టయితే.. అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. అప్పుడు బీసీసీఐ అతడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. అసలు ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నాడా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశంలో కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‍కు ముందు హెడ్ కోచ్ ఆదేశాలను ధిక్కరించి రంజీ ట్రోఫీ మ్యాచ్‍లకు ఇషాన్ డుమ్మా కొట్టడంతో ఈ డౌట్ ఎక్కువగా వినిపిస్తోంది.