ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం కప్ తెస్తుందా ?

ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ప్రతీసారీ ఇంగ్లాండ్ పేరు చెబుతున్నా ఆ జట్టుకు మాత్రం టైటిల్ కల నెరవేరడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 11:27 AMLast Updated on: Feb 18, 2025 | 11:27 AM

Will Englands Buzz Ball Strategy Bring The Cup In The Champions Trophy

ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ప్రతీసారీ ఇంగ్లాండ్ పేరు చెబుతున్నా ఆ జట్టుకు మాత్రం టైటిల్ కల నెరవేరడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు. ఎప్పటికప్పుడు ఇంగ్లండ్ ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2004, 2013లో ఫైనల్లో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ సారి మాత్రం కప్ గెలిచి టైటిల్ నిరీక్షణకు ముగింపు పలకాలని పట్టుదలగా ఉంది. అయితే అదంత ఈజీ మాత్రం కాదు. ఆ జట్టు ఉన్న గ్రూపులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, సంచలనాల ఆఫ్ఘనిస్థాన్ ఉండడంతో ఇంగ్లాండ్ అంచనాలకు తగ్గట్టు ఆడాల్సిందే. ఈ మెగాటోర్నమెంట్ కు ముందు భారత్ తో సిరీస్ లో వైట్ వాష్ పరాభవం ఇంగ్లీష్ టీమ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది. కానీ తమదైన బజ్ బాల్ వ్యూహంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సారి ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది.డకెట్, ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టన్ ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే సత్తా బ్యాటర్లే. సీనియర్ బ్యాటర్ రూట్ కు ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచే సామర్థ్యం ఉంది. అలాగే లివింగ్ స్టన్, కార్స్, ఒవర్టన్ లాంటి ఆల్ రౌండర్లు కూడా ఇంగ్లీష్ టీమ్ కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మాత్రం ఇంగ్లండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్లు ఆర్చర్, మార్క్ వుడ్ గాయాలతోనే టోర్నీకి సిద్ధమవుతున్నారు. ఆల్ రౌండర్ బెతెల్ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. స్పిన్ విభాగమూ వీక్ గా ఉంది. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ మాత్రమే అనుభజ్ఞుడు. రూట్, లివింగ్ స్టన్ పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా రాణిస్తే ఇంగ్లాండ్ కు కలిసొస్తుంది.

మరోవైపు సమష్టిగా రాణించలేకపోతుండడం ఇంగ్లాండ్ కు మైనస్ పాయింట్.కొంతమంది ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తప్ప జట్టుగా ఇంగ్లండ్ ఫెయిల్ అవుతోంది. 2023 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఆడిన 13 వన్డేల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. వరుసగా నాలుగు సిరీస్ ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెడుతోంది. కోచ్ గా బజ్ బాబ్ కాన్సెప్ట్ తో రెడ్ బాల్ క్రికెట్ లో సక్సెస్ అయిన మెక్ కల్లమ్ వన్డే జట్టుపై ఇంకా తన ముద్ర వేయలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెక్ కలమ్ కోచింగ్ లో ఇంగ్లండ్ సరికొత్త ఆటతీరుతో టైటిల్ దిశగా సాగుతుందనే అంచనాలున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ లో ఇంగ్లాండ్ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు చేరింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఓడించిన ఇంగ్లాండ్ సెమీఫైనల్లో మాత్రం పాక్ చేతిలో పరాజయం పాలైంది.