NCAకు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ మెగాటోర్నీ ఆడతాడా ?
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాల సమయమే మిగిలింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఎంపికయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాల సమయమే మిగిలింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఎంపికయ్యాడు. అయితే బుమ్రా ఫిట్ నెస్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియా టూర్ చివరి టెస్ట్ సందర్భంగా వెన్నునొప్పితో బాధపడి మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రత ఎక్కువవడంతో చికిత్స కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఐదు వారాల విశ్రాంతి తీసుకుని కోలుకుంటున్నాడు. కానీ మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై మాత్రం అనుమానంగానే ఉంది. బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతను ఇంకా అంచనా వేయలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా గాయం గ్రేడ్ 1 విభాగంలో ఉంటే.. అతడు కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. గ్రేడ్ 2 అయితే ఆరు వారాలు పట్టొచ్చు.
ప్రస్తుతం బుమ్రా బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అతని ఫిట్ నెస్ ను, గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ తో పాటు ఎన్సీఎ టీమ్ పర్యవేక్షిస్తున్నాయి. ఫిట్ నెస్ సాధిస్తేనే తుది జట్టులో బుమ్రాకు చోటు దక్కుతుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించే విషయంలోనే బుమ్రా బిజీగా ఉన్నట్టు సమాచారం. టెస్టుల్లో టాప్ బౌలర్ గా ఉన్న బుమ్రాను రిస్క్ తీసుకుని ఆడించే పరిస్థితి లేదు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు కూడా ఈ స్టార్ పేసర్ అందుబాటులో ఉండడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టునే బీసీసీఐ ఈ సిరీస్ కు కొనసాగించింది. కానీ బుమ్రా నొప్పి నుంచి పూర్తిగా కోలుకుని, ఫిట్ నెస్ సాధించే అవకాశం ఈ పదిరోజుల్లో లేదనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లకు కూడా బుమ్రా ఆడడని తెలుస్తోంది. టీమిండియా నాకౌట్ స్టేజ్ మ్యాచ్ లకు అతను అందుబాటులోకి వస్తే చాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోనూ , 23న పాకిస్థాన్ తోనూ, మార్చి 2న న్యూజిలాండ్ తోనూ భారత్ తలపడుతుంది. ఇంకా నెలరోజుల సమయం ఉండడంతో అతను నాకౌట్ మ్యాచ్ లకు కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా బుమ్రా భారత విజయాల్లో ఎంతకీలకంగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆసీస్ టూర్ లోనూ అదరగొట్టిన బుమ్రా ఐసీసీ అవార్డులతో పాటు బీసీసీఐ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. కాగా మెగా టోర్నీలో అతనికి ప్రత్యామ్నాయంగానే మహ్మద్ షమీని సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం షమీ ఫిట్ నెస్ పై కాస్త అనుమానాలు ఉన్నప్పటకీ ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీలో మూడు వికెట్లు తీయడం ద్వారా వాటికి తెరపడింది.