జియో-హాట్ స్టార్ కు పండగే ఈ సీజన్ తో అన్నివేల కోట్లా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం... ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ, ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ వరకూ, బ్రాడ్ కాస్టర్ల నుంచి బడాకార్పొరేట్ కంపెనీల వరకూ ఈ లీగ్ తో సంబంధమున్న ప్రతీ ఒక్కరికీ రెవెన్యూ మామూలుగా ఉండదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం… ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ, ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ వరకూ, బ్రాడ్ కాస్టర్ల నుంచి బడాకార్పొరేట్ కంపెనీల వరకూ ఈ లీగ్ తో సంబంధమున్న ప్రతీ ఒక్కరికీ రెవెన్యూ మామూలుగా ఉండదు.. అందుకే ఐపీఎల్ ను బీసీసీఐ బంగారుబాతుగా పిలుస్తుంటారు. ఆర్థిక మాంద్యంతో చాలా ఇండస్ట్రీలు దెబ్బతిన్నా ఐపీఎల్ వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంది.. క్రేజ్ విషయంలోనూ, వ్యూయర్ షిప్ లోనూ, రెవెన్యూలోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం 18వ సీజన్ కు సమయం దగ్గర పడిన వేళ ఈ సారి బ్రాడ్ కాస్టర్లకు భారీగా ఆదాయం రానుంది.
రిలయన్స్‌కు చెందిన జియోస్టార్ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను 2023-2028 వరకు దక్కించుకుంది. ప్రపంచ క్రికెట్ లో రిచ్చెస్ట్ లీగ్ గా ఉన్న ఐపీఎల్ జియో-హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతుండడంతో వేల కోట్లు సంపాదిస్తోంది. అయితే రిలయన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోన్న ఈ బ్రాడ్‌కాస్టింగ్ వల్ల యాడ్స్ స్లాట్ బుకింగ్ ధరలు పెరిగాయని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 25 నుంచి 30శాతం పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఐపీఎల్ 2025 ద్వారా రిలయన్స్ జియోస్టార్ రికార్డ్ బ్రేకింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూను అందుకోనుంది తెలిసింది. పలు నివేదికల ప్రకారం టెలివిజన్ లో 10 సెకన్ల యాడ్ ధర 18 నుంచి 19 లక్షలు ఉందట. గతేడాది ఇదే స్లాట్ ధర 16.4 లక్షలుగా ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 మొత్తం ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఏడు వేల కోట్ల వరకు వస్తుందని అంచనా. అయితే ఇందులో జియో హాట్ స్టార్ కి 4,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ లో పాల్గొనే పది జట్లు, బీసీసీఐ కూడా యాడ్ రెవెన్యూ విషయంలో ఈ స్పాన్సర్షిప్ ద్వారా బాగానే అర్జిస్తుంది.
ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా జట్లు 1300 కోట్లు, బీసీసీఐ 900 కోట్లు సంపాదిస్తాయని అంచనా. అయితే ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈ లీగ్ లలో కూడా జట్లను కొనుగోలు చేసింది. ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఫ్రాంచైజీ లీగ్ లో జట్టు ది 100 లో దాదాపు సగం వాటాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అటు హాట్ స్టార్ ను మెర్జ్ చేసుకుని జియో-హాట్ స్టార్ కలిపి తీసుకురావడం కూడా అంబానీ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు యాడ్ స్లాట్ రేట్లు పెంచడం ద్వారా ఒక్క సీజన్ తోనే భారీగా ఆదాయాన్ని అందుకోబోతోంది. కాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుండగా.. మొత్తం 74 టీ ట్వంటీలు అభిమానులను అలరించబోతున్నాయి. ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది.