ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ టైటిల్ నిలుపుకుంటుందా ?

ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే... ఒక్కోసారి పెద్ద జట్లను సైతం సునాయాసంగా ఓడిస్తుంది... మరోసారి చిన్న జట్టు చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 07:10 PMLast Updated on: Feb 18, 2025 | 7:10 PM

Will Pakistan Retain The Champions Trophy Title

ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే… ఒక్కోసారి పెద్ద జట్లను సైతం సునాయాసంగా ఓడిస్తుంది… మరోసారి చిన్న జట్టు చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూస్తుంది. ఒక్కోసారి 350 ప్లస్ టార్గెట్ ను సైతం ఛేజ్ చేస్తుంది.. మరోసారి 120 రన్స్ కూడా కొట్టలేని జట్టుగా పాక్ కు పేరుంది.. అందుకే నిలకడ లేని జట్టుగా పాక్ ను పిలుస్తుంటారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. నిలకడ లేని జట్టు కాబట్టే తక్కువ అంచనా వేయకూడదన్నది కొందరు విశ్లేషకుల మాట.. పైగా సొంతగడ్డపై ఆడుతోంది… హోం కండీషన్స్ లో అభిమానుల మద్ధతుగా అద్భుతంగా రాణించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే టైటిల్ ఫేవరెట్లలో మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త వెనుకబడినా పాక్ ను తీసిపారేయలేం.

2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన పాక్ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది. ఇటీవల వన్డేల్లో జోరుమీదున్న ఆ జట్టు స్వదేశంలో చెలరేగాలని చూస్తోంది.స్వదేశంలో అదరగొట్టి టైటిల్ నిలబెట్టుకోవాలన్నదే ఆ జట్టు టార్గెట్. అంతే కాదు భారత్ ను ఓడించాలన్నది మరో ప్రధాన లక్ష్యం. పాకిస్థాన్ కు అతిపెద్ద బలం వారి ఫాస్ట్ బౌలింగే. షహీన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్ పేస్ త్రయం అత్యంత ప్రమాదకరమని చెప్పొచ్చు. సొంతగడ్డపై ఈ ముగ్గురు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త బంతితో షహీన్ ను ఎదుర్కోవడం సవాల్ గానే భావిస్తున్నారు. 59 వన్డేల్లో 119 వికెట్లు తీసిన షహీన్ తొలి పవర్ ప్లేలో 41 వికెట్లు పడగొట్టాడు. నసీం 20 మ్యాచ్ ల్లో 42 వికెట్లు, హారిస్ 42 మ్యాచ్ ల్లో 85 వికెట్లు సాధించాడు. మరోవైపు అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది.

అయితే నిలకడలేని బ్యాటింగ్ వారికి ప్రధాన సమస్య… బ్యాటింగ్ లో కీలక ఆటగాడు బాబర్ ఆజంపై చాలా ఆశలున్నాయి. ఇక సొంతగడ్డపై 73 సగటుతో ఉన్న అతణ్ని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు సవాలే. ప్రస్తుతం స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్న బాబర్ మెగాటోర్నీలో చెలరేగాలని పాక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్, ఫకర్ జమాన్ కూడా బ్యాటింగ్ లో సత్తా చాటే ఆటగాళ్ళే. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయాలు పాక్ కాన్ఫిడెన్స్ ను పెంచాయి.
అయితే గాయంతో సయిం ఆయూబ్ జట్టుకు దూరమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి. ఇదిలా ఉంటే ఒత్తిడికి తలొగ్గడం పాక్ కు ఉన్న ప్రధాన బలహీనత. ఈ వీక్ నెస్ కారణంగానే గెలిచే మ్యాచ్ లు కూడా చేజార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాక్ మరో ఐసీసీ టోర్నీలో గెలవలేదు. ఇక భారత్ మ్యాచ్ ఆ జట్టుకు అతిపెద్ద పరీక్ష. దుబాయ్ లో టీమ్ఇండియా చేతిలో ఓడితే స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవడంతో పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. 2017 ఎడిషన్ లో పాక్ జట్టు నిలకడగా రాణించింది. తొలి మ్యాచ్ లో భారత్ పై ఓడినప్పటకీ…తర్వాత వరుస విజయాలతో టైటిల్ గెలిచింది.