వేలంలో ధావన్ ఉంటాడా ? సందిగ్ధంలో ఐపీఎల్ కెరీర్
భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఐపీఎల్ ఆడడంపై మాత్రం గబ్బర్ క్లారిటీ ఇవ్వలేదు. అతను వచ్చే సీజన్ ఆడతాడా… డిసెంబర్ లో జరిగే మెగా వేలంలో ఉంటాడా అన్న చర్చ మొదలైంది. ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ డెక్కన్ ఛార్చర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 222 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్..6768 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడి బెంచ్ కే పరిమితమయ్యాడు. గత సీజన్ లోనూ అతని ఫామ్ అనుకున్న స్థాయిలో లేదు. దీంతో గబ్బర్‌ను కొనసాగించేందుకు పంజాబ్ కింగ్స్ కూడా సముఖంగా లేనట్లు తెలుస్తోంది.
దీనికి తగ్గట్టుగానే పంజాబ్ కింగ్స్ థ్యాంక్యూ శిఖర్ ధావన్ అని అతని ఫొటోను షేర్ చేసింది. అటు మెగా వేలంలో ధావన్ తన పేరు రిజిస్టర్ చేసుకుంటాడా, చేసుకుంటే ఫ్రాంచైజీలు అతన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తాయా అనేది డౌటే. ఎందుకంటే ఫిట్ నెస్, వయసు దృష్ట్యా ఫ్రాంచైజీలు గబ్బర్ ను తీసుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ గబ్బర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని భావిస్తే విదేశీ టీ20 లీగ్స్‌తో పాటు లెజెండ్స్ క్రికెట్ టోర్నీల్లో కనిపించే అవకాశం ఉంది.