Cricket: ఓటమి మంచిదే..! టీమిండియా కాళ్లు నేలకు దిగుతాయా…!

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం.. వాళ్లు గెలిచారని చెప్పడం కంటే మనం ఓడామనడమే కరెక్ట్... మరి ఓటమి మంచిదేనా...? కళ్లు నెత్తికెక్కిన ఆటగాళ్ల కాళ్లు నేలకు దిగుతాయా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2023 | 11:48 AMLast Updated on: Mar 23, 2023 | 11:48 AM

Will Team India Learn Lessons From Lost Odi Series

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం.. వాళ్లు గెలిచారని చెప్పడం కంటే మనం ఓడామనడమే కరెక్ట్… మరి ఓటమి మంచిదేనా…? కళ్లు నెత్తికెక్కిన ఆటగాళ్ల కాళ్లు నేలకు దిగుతాయా…?

ఆస్ట్రేలియా చేతిలో 2-1తేడాతో ఓడి టీమిండియా సిరిస్ కోల్పోయింది. స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత తొలిసారి సిరీస్ కోల్పోయింది. ప్రపంచ నెంబర్1 ( నిన్నటివరకే) వన్డే జట్టుకు ఇది ఓటమి అని చెప్పడం కంటే మేలుకొలుపు అనే చెప్పాలి. వరుస విజయాలతో కళ్లు నెత్తికెక్కిన మన ఆటగాళ్లు ఇప్పటికైనా పరిస్థితిని గ్ర హించి వాస్తవంలోకి వస్తారేమో చూడాలి. కీలకమైన ప్రపంచకప్ ముంగిట ఈ ఓటమితో సమీక్ష చేసుకుంటారేమోనన్నది సగటు అభిమాని ఆశ

మనదేశానికి ఏ క్రికెట్ జట్టు వచ్చినా గెలవడం కష్టమే. స్పిన్ తిరిగే పిచ్‌లపై మనల్ని ఎదుర్కోవడం అంటే పెనుసవాలే… ఇటీవలి వరకు వచ్చిన ఫలితాలు అందుకు నిదర్శనం. పైగా మన ఫ్లాట్ పిచ్‌లపై మన పేపర్ పులులు రెచ్చిపోయేవి. అయితే ఆస్ట్రేలియా ఆ రికార్డును తిరగరాసింది. మనవాళ్లను నేలకు దించింది. రోహిత్ నుంచి అక్షర్ వరకు ప్రతి ఒక్కరూ స్టార్లే… కానీ కలసికట్టుగా ఆడింది లేదు. ఒకరు ఆడితే ఇంకొకరు ఆడరు.. ఒకరు ఫామ్‌లో ఉంటే ఇంకొకరు ఫామ్ కోల్పోతారు. రకరకాల ప్రయోగాలు… రకరకాల కాంబినేషన్లు.. ఒక సిరీస్‌లో ఉన్నవారు మరో సిరీస్‌కు ఉండరు.. అబ్బో గత రెండేళ్ల కాలంలో టీమిండియా చేసినన్ని ఎక్స్‌పరిమెంట్లు మరే జట్టు చేయలేదేమో…

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి మన జట్టుకు పునరాలోచన చేయడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇదే అతి విశ్వాసంతో ప్రపంచకప్‌కు వెళితే పరాభవం తప్పదని ఆస్ట్రేలియా చెప్పింది. మన ఓపెనర్లు మంచి ఫామ్‌లో అయితే లేరు. రోహిత్ తడబడుతున్నాడు. కెప్టెన్సీ హిట్‌మ్యాన్ గేమ్‌పై ప్రభావం చూపినట్లుంది. స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. గిల్ కూడా ఓ మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ ఆడట్లేదు. ఇషాన్ కిషన్‌ది కూడా అదే పరిస్థితి. ఇక రన్‌మెషిన్ కోహ్లీ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఆసియా కప్ తర్వాత కోహ్లీలో ఆ దూకుడు మళ్లీ కనిపించలేదు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో కోహ్లి రాణించి ఉండొచ్చు… కానీ ఒకప్పటి స్థిరత్వం అయితే కోహ్లీలో లేదన్నది వాస్తవం. ఇక శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరమయ్యాడు. టీ20 నెంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. సూర్య మంచి ఆటగాడే అయినా వన్డేల్లో మాత్రం తడబడుతున్నాడు. అతడి టెక్నిక్‌ను ఆస్ట్రేలియా డీకోడ్ చేసిందో లేక సూర్యనే వికెట్ పారేసుకుంటున్నాడో కానీ వరుస తడబాటు జట్టుకు మంచిది కాదు. అలాగే కె.ఎల్.రాహుల్ కూడా ఫామ్ కోల్పోయాడు. ఇక వికెట్ కీపర్ సంగతేంటో అర్థం కావడం లేదు. రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. రాహుల్‌తో కీపింగ్ చేయిస్తే మరో ఆటగాడికి అవకాశం ఇవ్వొచ్చు. అయితే రాహుల్ ఫామ్‌లో లేకపోవడంతో మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే హార్దిక్ పాండ్య, రవీంద్రజడేజా, అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ప్రపంచకప్‌లో చోటు దాదాపు గ్యారెంటీగా కనబడుతోంది. అయితే జడేజా కూడా పెద్దగా బ్యాటుకు పనిచెప్పడం లేదు. అక్షర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. హార్దిక్ ఎప్పుడు ఆడతాడో తనకే తెలియదు. శార్దూల్ ఠాగూర్ బౌలింగ్‌లో పరుగులు ఇచ్చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో నేనున్నాన్న భరసా మాత్రం ఇవ్వలేకపోతున్నాడు.

బౌలింగ్ విషయానికి వస్తే అదో పెద్ద సమస్యై కూర్చుంది. బుమ్రా అందుబాటులో ఉండటం అనుమానమే. సిరాజ్ దారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఒక మ్యాచ్‌లో అద్భతమనిపిస్తున్న ఈ హెదరాబాదీ మరో మ్యాచ్‌లో తేలిపోతున్నాడు. షమిపైనే భారం పడనుంది. భువనేశ్వర్ చాలాకాలంగా జట్టులో లేడు. ప్రసిద్ద కృష్ణకు జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియదు. ఉమ్రాన్ మాలిక్‌కు స్పీడ్ అయితే ఉంది కానీ సరైన లైన్ అండ్ లెంగ్త్ మాత్రం అర్థం కావడం లేదు. చాహల్, కుల్‌దీప్ బౌలింగ్ యాక్షన్ మిగిలిన జట్లకు అర్థమైపోయినట్లుంది. ఇలా ఎవరిని తీసుకున్నా ఏదో ఓ సమస్య వేధిస్తోంది.

క్రికెట్ అంటే జంటిల్‌మెన్ గేమే కాదు.. కలెక్టివ్ గేమ్. ఒక్కరు ఆడితే మ్యాచ్ గెలవదు… అందరూ ఆడాలి. ఒకరిద్దరు విఫలమైనా మిగిలిన వారు ఆ లోటు కనిపించకుండా చూడాలి. మన జట్టులో ఇప్పుడు లోపించింది అదే. ఆడితే అందరూ ఆడుతున్నారు. లేకపోతే అంతా చేతులెత్తేస్తున్నారు. టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌నకు ముందు మరే ఇతర సిరీస్ లేదు. ధనాధన్ ఐపీఎల్ తర్వాత నేరుగా వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే. ఈ టైమ్‌ను ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలి. తమ తప్పులను సమీక్షించుకుని ఆటపై దృష్టి పెట్టాలి. ఆస్ట్రేలియా సిరీస్ నేర్పిన పాఠాలనుంచి నేర్చుకోవాలి. కలసికట్టుగా ఆడాలన్న తపనతో రంగంలోకి దిగాలి. లేకపోతే వన్డే ప్రపంచకప్‌పై ఆశలు వదులుకోవాలి.

అభిమానులకు కూడా ఈ సిరీస్ ఓ క్లారిటీ ఇచ్చేసి ఉండాలి. మన జట్టు గెలవాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా ఆడుతున్న జట్టుపై మాత్రం అతి ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది.

(KK)