పాక్ జట్టుకు పరువు దక్కేనా ? బంగ్లాదేశ్ తో చివరి మ్యాచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సారి ఆతిథ్య పాకిస్తాన్ ఎదుర్కొన్న విమర్శలు మరే జట్టుకూ గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. ఒకవైపు టోర్నీ నిర్వహణలో సమస్యలు, మరోవైపు పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 10:30 AMLast Updated on: Feb 27, 2025 | 10:30 AM

Will The Pakistan Team Get Credit Last Match Against Bangladesh

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సారి ఆతిథ్య పాకిస్తాన్ ఎదుర్కొన్న విమర్శలు మరే జట్టుకూ గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. ఒకవైపు టోర్నీ నిర్వహణలో సమస్యలు, మరోవైపు పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు చివరి నామమాత్రపు పోరులో తలపడుతున్నాయి. ఇది నామమాత్రమే అయినా ఇరు జట్లకు మాత్రం పరువు సమస్యగా మారింది. ముఖ్యంగా టోర్నీ నుంచి లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన పాక్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. బంగ్లా చేతిలో కూడా ఓడితే మాత్రం ఆ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉండబోతోంది. స్వదేశంలో పాక్ క్రికెటర్లు కొన్నాళ్ళు కనిపించే పరిస్థితి ఉండదు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ బంగ్లాపై గెలిచి టోర్నీని విజయంతో ముగించాలని పాక్ పట్టుదలగా ఉంది. అటు బంగ్లాదేశ్ కూడా చివరి మ్యాచ్ లో విజయం కోసం గట్టిగానే ప్రయత్నించేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ కూడా గెలిచిన బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

పాక్ బ్యాటింగ్ ఈ సారి అత్యంత పేలవంగా ఉంది. ఫకర్ జమాన్ లాంటి ప్లేయర్ దూరమవడం , బాబర్ అజామ్ ఫామ్ లో లేకపోవడం, మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా నిలకడగా రాణించకపోవడం పాక్ కు సమస్యగా మారాయి. అటు బౌలింగ్ లోనూ స్పిన్నర్ అబ్రార్ ఒక్కడే పర్వాలేదనిపిస్తుండగా.. మిగిలిన బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.. ఎందుకంటే గతంలో పలు ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సంచలన విజయాలు నమోదు చేసింది. భారత్ తో మ్యాచ్ లో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా పేలవ ఫామ్ లో ఉన్న పాకిస్తాన్ ను ఓడించే సత్తా బంగ్లాకు ఉందనే చాలా మంది అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టులో కెప్టెన్ శాంటో రాణిస్తుండగా..మిగిలిన వారిలో నిలకడలేమి ఇబ్బందిగా మారింది. వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ కూడా విఫలమవుతున్నాడు. భారీస్కోర్ చేయాలంటే కీలక బ్యాటర్లందరూ ఫామ్ లోకి రావాల్సిందే.. బౌలింగ్ లో టస్కిన్ అహ్మద్ తో పాటు మిగిలిన బౌలర్లు రాణిస్తేనే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

ఇదిలా ఉంటే పాక్, బంగ్లా మ్యాచ్ జరిగే రావల్పిండి పిచ్ బౌలర్లతో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలిస్తుంది. ఈ మెగాటోర్నీలో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లా, కివీస్ చేతిలో ఓడిపోయింది. ఆసీస్, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే పాక్, బంగ్లా మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ కు పలు సార్లు వరుణుడు అడ్డుపడతాడని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. పాకిస్తాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉంది. క‌నీసం బంగ్లాదేశ్‌ను అయిన ఓడిస్తే ఆ జ‌ట్టు ఐదు లేదా ఆరో స్థానంతో టోర్నీని ముగిస్తుంది.