ఈ సాలా కప్ నమదే ఆర్సీబీ కల నెరవేరేనా ?
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఒక స్లోగన్ అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తుంది... అదే ఈ సాలా కప్ నమదే... ఈపాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ స్లోగన్ ఎవరిదో... యెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం..ఈ సారి కప్ మనదే...

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఒక స్లోగన్ అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తుంది… అదే ఈ సాలా కప్ నమదే… ఈపాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ స్లోగన్ ఎవరిదో… యెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం..ఈ సారి కప్ మనదే… లీగ్ ఆరంభం నుంచీ ఈ స్లోగన్ వినిపిస్తున్నా ఆర్సీబీ టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. కానీ గత ఏడాది చివర్లో జరిగిన మెగావేలంలో ఆర్సీబీ చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ను దక్కించుకుంది. తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం పోటీపడకుండా పటిష్టమైన తుదిజట్టు నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది. గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్‌ను అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది. స్పష్టమైన వ్యూహాలతో మిడిలార్డర్‌ను బలోపేతం చేసింది. పవర్‌ప్లేలో వికెట్లు సాధించేలా అనుభవం ఉన్న పేసర్లను తీసుకుంది. డెత్ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లను సొంతం చేసుకుంది. స్పిన్‌ను బలోపేతంగా మార్చుకుంది. ఫినిషర్లను వేలంలో సొంతం చేసుకుంది. ఈ సారి కెప్టెన్ ను కూడా మార్చింది. కొత్త సారథిగా రజత్ పటిదార్ ను నియమించింది.
మెగావేలానికి ముందు ఆర్సీబీ ముగ్గురు ఆటగాళ్లన రిటైన్ చేసుకుంది. అందులో విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటీదార్ కూడా ఉన్నాడు. మరో ప్లేయర్‌గా యశ్ దయాళ్ రిటైన్ అయ్యాడు. గతంలో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకే మళ్లీ పగ్గాలు అప్పగిస్తారని అంతా ఊహించారు. కానీ విరాట్ ఆటగాడిగానే కొనసాగలని భావించినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. ఆర్సీబీ రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆ జట్టు కాంబినేషన్ ను చూస్తే బలంగానే కనిపిస్తోంది. విరాట్ కోహ్లి-ఫిల్ సాల్ట్-రజత్ పటిదార్‌లతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్‌కు బ్యాకప్‌గా దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌లతో మిడిలార్డర్ కూడా బలోపేతంగా మారింది. జితేశ్, డేవిడ్ ఫినిషర్ల పాత్రను పోషించనున్నారు. మిడిలార్డర్‌కు బ్యాకప్‌గా జాకోబ్ బెథెల్, రోమెరియా షెఫార్డ్ ఉన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా కొనసాగుతోన్న కోహ్లీనే ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్సుంది. ఈ సీజన్ లోనూ తన అగ్రెసివ్ నెస్ తో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కోహ్లీతో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటిదర్ ఒకడు. అతడు నెం త్రీలో బ్యాటింగ్ చేయొచ్చు. ఆల్ రౌండ్ లియామ్ లివింగ్ స్టోన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఆడొచ్చు. అతడు బంతితోనూ రాణించగలడు. కృనాల్ పాండ్య కూడా బంతితోనూ బ్యాట్ తోనూ పర్ఫక్ట్ బ్యాలెన్స్ ఇవ్వగలడు. గతంలో అతడు ఇతర జట్లకు వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఈసారి అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేశ్ శర్మ నెం.6లో రావొచ్చు. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఆర్సీబీ బాగా తోడ్పడచ్చు. పవర్ హిట్టింగ్ కి పేరున్న టిమ్ డేవిడ్ నెం.7లో దిగి ఫినిషింగ్ బాధ్యతను తీసుకుంటాడు. ఆటను ముగించడంలో అతడు కీలకంగా వ్యవహరిస్తాడు.
ఇక పవర్‌ప్లే బాధ్యతలు అనుభవజ్ఞులు భువనేశ్వర్, హేజిల్‌వుడ్ అందుకోనున్నారు. మిడిల్-డెత్ ఓవర్ల బాధ్యతలను రసిక్ సలామ్, యశ్ దయాల్ పై ఉంటుంది. కృనాల్ పాండ్యతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాశ్ శర్మ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బంతితో కీలకంగా వ్యవహరించే అవకాశముంది. పవర్ ప్లేలో అతడు కొత్త బంతితో చేసే మాయే ఆర్సీబీ విజయాన్ని నిర్ణయిస్తుంది. సుయాశ్ శర్మ స్పిన్ ఈ సీజన్ లో ఆర్సీబీకి ఎంతో కీలకం. అతడి నుంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ను ఆర్సీబీ కోరుకుంటోంది. గత సీజన్ లో ఆర్సీబీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బౌలర్ యశ్ దయాల్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తన అద్భుత ప్రదర్శన మళ్లీ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ జోష్ హెజిల్ వుడ్ తాను ఎంత పవర్ ఫుల్ బౌలరో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగొచ్చు.