ప్రమాదాలు జరిగినా ప్రయోగాలు తప్పవా?
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మంగళవారం జరుగనున్న మూడో మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది! ప్రయోగాల పేరుతో పేలవ ఆటతీరు కనబర్చి.. కొత్త తలనొప్పి కొనితెచ్చుకున్న టీమిండియా.. మూడో వన్డేలోనూ అదే రూట్‌లో నడవాలని అనుకుంటోంది.
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో పోరు జరుగనుండగా.. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. తొలి వన్డేలో జట్టుతో పాటు ఉన్నా.. అసలు బ్యాటింగ్ చేయని విరాట్ కోహ్లీకి రెండో మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇక మూడో మ్యాచ్‌లోనైనా కింగ్.. దుమ్మురేపుతాడని ఆశిస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశాలున్నాయి. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్, విండీస్ ఒక్కో విజయం నమోదు చేయగా.. మూడో వన్డేకు ట్రినిడాడ్‌లోని టరోబా ఆతిథ్యమివ్వనుంది.
ఆఖరి సమరం కోసం భారత జట్టు ఇప్పటికే ట్రినిడాడ్ చేరుకోగా.. అందులో విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిస్తున్నామని.. చెప్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీని బెంచ్ కే పరిమితం చేస్తాడా అనే డౌట్ వస్తోంది. అందుకే విరాట్ జట్టుతో పాటు ట్రినిడాడ్ బయల్దేరలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. దానికి ముందు టీమిండియా.. ఎక్కువలో ఎక్కువ 10 మ్యాచ్‌లు ఆడనుంది.
మరి ఈ పది మ్యాచ్‌ల్లోనైనా తమ ప్రధాన బ్యాటర్‌ను బరిలోకి దింపి లయ అందుకునేలా చేయాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఉండగా.. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందం మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది. నిజంగానే కోహ్లీకి రెస్ట్ ఇస్తే.. అతడి స్థానాన్ని సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఏమేరకు భర్తీ చేస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో వచ్చిన సువర్ణ అవకాశాన్ని వీరిద్దరూ వృథా చేసుకున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వసమరానికి అర్హత సాధించలేకపోయి.. నానాటికి తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్ జట్టు చేతిలో ప్రస్తుతం టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో కనిపిస్తోంది. మరి కోహ్లీకి రెస్ట్ ఇచ్చి మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకుంటుందా.. లేక ప్రయోగాలే తమ ప్రధాన లక్ష్యమని.. యువ ఆటగాళ్లకే అవకాశమిస్తుందా.. అనేది ఇంకొన్ని గంటల్లో తేలనుంది.