నన్నే వదిలేస్తారా ? ఆర్సీబీకి ఇచ్చిపడేసిన సిరాజ్

ఐపీఎల్ లో ఎప్పుడు ఎవరు కలిసి ఆడతారో... ఎప్పుడు ప్రత్యర్థులుగా ఆడతారో చెప్పలేం.. ఎందుకంటే ఇది కమర్షియల్ లీగ్ కాబట్టి ప్రదర్శన బాగా లేకుంటే ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడినైనా వదిలేయొచ్చు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2025 | 07:30 PMLast Updated on: Apr 03, 2025 | 7:30 PM

Will You Leave Me Alone Siraj Who Was Traded To Rcb

ఐపీఎల్ లో ఎప్పుడు ఎవరు కలిసి ఆడతారో… ఎప్పుడు ప్రత్యర్థులుగా ఆడతారో చెప్పలేం.. ఎందుకంటే ఇది కమర్షియల్ లీగ్ కాబట్టి ప్రదర్శన బాగా లేకుంటే ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడినైనా వదిలేయొచ్చు.. వేలంలో మరో ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ ను తీసుకోవచ్చు… అదే సమయంలో తన పాత టీమ్ పై అదే ఆటగాడు చెలరేగితే ఆ కిక్కే వేరు.. ప్రస్తుతం హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ది ఇదే పరిస్థితి… ఏడేళ్ళు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ఇప్పుడు అదే జట్టు ప్రత్యర్థిగా దిగి దెబ్బ కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్ తాజాగా ఆర్సీబీపై అద్భుత బౌలింగ్ తో రెచ్చిపోయాడు.

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై నిప్పులు చెరిగాడు. పవర్ ప్లేలోనే ఆర్‌సీబీని దెబ్బతీసాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సిరాజ్‌‌ను ఆర్‌సీబీ వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన సిరాజ్.. ముంబై ఇండియన్స్‌తో పాటు ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. ఆరంభ మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్‌.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్‌ సాల్ట్‌, దేవదత్‌ పడిక్కల్‌, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా ఈ మ్యాచ్ లో సాల్ట్ ను హైదరాబాదీ పేసర్ క్లీన్ బౌల్డ్ చేసిన తీరు హైలెట్ గా నిలిచింది. సిరాజ్ వేసిన నాలుగో బంతికి సాల్ట్ క్లీన్ బౌల్డయ్యాడు. 144 కి.మీ వేగంతో విసిరిన ఈ బంతి స్టంప్ కు తగిలి చాలా దూరంలో పడింది. అంతక ముందు ఓవర్లో పడిక్కల్ ను బౌల్డ్ చేసిన సిరాజ్ కు ఈ వికెట్ మరింత కిక్ ఇచ్చింది. సాల్ట్ ఔటవ్వడంతో రోనాల్డ్ సెలెబ్రేషన్ తో సిరాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక చివర్లో హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న లివింగ్ స్టోన్ వికెట్ను కూడా పడగొట్టాడు.

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేసాడు. ఈ స్టేడియంలో ఆడేటప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాననీ, ఇక్కడు ఏడేళ్లు నుంచి ఉంటున్నానని గుర్తు చేసుకున్నాడు. కానీ ఒక్కసారి బంతికి చేతికి వచ్చిందంటే విజృంభిస్తాననీ, విరామం సమయంలో తన తప్పులను సరిదిద్దుకున్నట్టు చెప్పాడు. తనను తీసుకున్న తర్వాత ఆశిష్ నెహ్రాతో తో మాట్లాడి పేస్ పై మరింత ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడిన సిరాజ్.. ఈ సీజన్‌లో అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో మొదటిసారిగా గుజరాత్ తరుపున ఆడుతున్నాడు సిరాజ్. ఈ సీజన్లో మొదటిసారి ఆర్సీబీపై ఆడుతుండడంతో.. అందరి చూపు సిరాజ్ పైనే పడింది. కచ్చితంగా ఆర్సీబీపై రివేంజ్ తీర్చుకుంటాడని అందరూ అనుకున్నారు. అన్నట్లుగానే.. సూపర్ బౌలింగ్ చేసి ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.